Liquor Policy AP: తాము అధికారంలోకి వస్తే మద్యనిషేధం చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఏపీలోని అక్కచెల్లెళ్లకు హామీ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా నేటికీ మద్యం నిషేధం ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. దీనికితోడు మద్యం షాపులను తగ్గిస్తున్నామనే సాకుతో మద్యం రేట్లను భారీగా పెంచి ప్రభుత్వం ఖజనా నింపుకునే ప్రయత్నం చేస్తోందని అన్నివర్గాల నుంచి విమర్శలకు తావిస్తోంది.
మద్యం రేట్లు చూస్తేనే షాక్ కొడుతుందని జగన్మోహన్ రెడ్డి గతంలోనే చెప్పారు. రేట్లు పెంచడం వల్ల మద్యంబాబు మందు మానేస్తారనేది జగన్మోహన్ రెడ్డి వాదన. కానీ ఆచరణలో మాత్రం ఇది ఏమాత్రం జరుగలేదని మద్యంపై ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని చూస్తే చదువురాని వాడికి కూడా అర్థమైపోతుంది. మరోవైపు ప్రభుత్వం మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టుపెట్టి పెద్దమొత్తంలో రుణాలు తీసుకురావడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
Also Read: CM Jagan: ఒంటరిపోరు మళ్లీ కలిసి వస్తుందా?
వైసీపీ అధికారంలోకి వచ్చాక మద్యం రేట్లను ఓ పద్ధతిపాడు లేకుండా పెంచేసి మద్యంబాబు జేబులకు చిల్లుపెట్టింది. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ఈక్రమంలోనే కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం మద్యంపై వ్యాట్ ను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మద్యంబాబులు సంబురాలు చేసుకున్నారు. మద్యంపై రేట్లను తగ్గించారని భావించారు. అయితే వ్యాట్ ను తగ్గించిన ప్రభుత్వం స్పెషల్ మార్జిన్ పేరుతో ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్ నుంచి వసూలు చేసుకునేలా ప్రత్యేక ఆర్డినెన్స్ రూపొందించారు.
ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు సజావుగా సాగాలంటే ప్రభుత్వం వీలైనంత వరకు అప్పులపైనే ఆధారపడుతోంది. ఇప్పటికే అందికడల్లా అప్పులు చేసిన ప్రభుత్వం మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపి భారీగా రుణాలను తీసుకుంటోంది. వ్యాట్ ను తగ్గించి స్పెషల్ మార్జిన్ పేరుతో ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ నుంచి రాబడుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని విమర్శలు రావడంతో కేంద్రం సైతం ఏపీ సర్కారుకు మొట్టికాయలు వేసినట్లు తెలుస్తోంది.
అయితే ఏపీ అప్పులు తెచ్చుకోవాలంటే ఇంతకంటే గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలోనే ప్రభుత్వం మద్యంబాబులను పాతికేళ్లపాటు రుణాల కోసం తాకట్టు పెట్టింది. అంతేకాకుండా మద్యంపై మరింత ఆదాయం రాబట్టేలా చర్యలు చేపడుతోంది. అప్పుల కోసం ప్రభుత్వం ఎన్నిరకాల జిమ్మిక్కులు చేయాలో అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రభుత్వం దూకుడు చేస్తుండే మద్యనిషేధం ఏమోగానీ రాబోయో రోజుల్లో ఏపీ మద్యాంధ్రప్రదేశ్ గా మారడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: Liquor Deaths: వైసీపీ తప్పుడు మద్యం విధానంతో పేదలు బలి