‘‘ఈ ప్రపంచంలో ఎవరి మార్గం సరైనది?’’ అన్న ప్రశ్నకు వచ్చే సమాధానంలో ఏకాభిప్రాయం ఉంటుందా? ఇది అసాధ్యమని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒకరికి నచ్చిన బాట ఇంకొక్కరికి నచ్చదు. ఒకరు ఎంచుకున్న సిద్దాంతం.. మరొకరికి గిట్టదు. అంతెందుకు.. ఒక పాట, ఒక మాట, ఒక రంగు, ఒక మనిషి మరొకరికి నచ్చరు. అప్పుడేమవుతుంది? ఘర్షణలు తలెత్తేందుకు ఆస్కారం ఉంది. అందుకే.. దేశంలోని మనుషులంతా ఒక ఒప్పందం చేసుకున్నారు. దాన్నే రాజ్యాంగం అని అంటారు. ఈ దేశంలోని పౌరులు ఎవరు ఏం చేయాలో? ఏం చేయకూడదో? అందులో సవివరంగా రాసి ఉంటుంది. ఆ రాజ్యాంగం చెప్పిన ప్రకారమే.. మనుషులంతా నడుచుకోవాలి. ఇదే ఫైనల్.
ఆ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటి వాక్ స్వాతంత్రం. ఒక విషయమై తమ అభిప్రాయం చెప్పడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది. తమదైన ప్రశ్నలు వేయడానికి స్వాతంత్రం ఉంది. కానీ.. కొందరికి ఈ ప్రశ్నలు వేయడం నచ్చదు. వారు కోరుకున్నది మాత్రమే జరగాలని ఆశిస్తారు. తమకు ఎదురే ఉండొద్దని కోరుకుంటారు. తమలో లోపం చూపించినా తట్టుకోలేరు. దాన్ని మార్చుకుందామనే విచక్షణ ఉండదు. అదే సరైనదిగా భావిస్తూ.. దాన్ని వ్యతిరేకించేవారిని శత్రువుల జాబితాలో చేరుస్తారు. ఇలాంటి వారికి ఈ సమాజంలో కొదవలేదు. ఇలాంటి కొన్ని వర్గాలే.. కత్తి మహేష్ ను ప్రత్యర్థిగా భావించాయి.
ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుడిని నమ్మాలా? ఏ దేవుడిని నమ్మాలి? ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? అసలు దేవుడు ఉన్నాడా? వంటి ప్రశ్నలు లేవనెత్తుతారు నాస్తికులు. ఇవి వారి సందేహాలుగా భావించి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మతం, దేవుడి ఉనికికి సంబంధించిన ప్రశ్నలు కాబట్టి.. వాటికి సమాధానం చెప్పి, దేవుడు ఉన్నాడని నిరూపించుకోవాల్సిన బాధ్యత, అవసరం ఆస్తికుల మీద ఉంటుంది. నమ్మకం పెంచడం ద్వారా తమ మతాన్ని, దేవున్ని ఆరాదించే వారి సంఖ్య కూడా పెంచుకునే వీలుంది. ఇది జరగాలంటే.. పై ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆరాధకులకు ఉంటుంది.
ఒకవేళ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేము అనుకున్నప్పడు, తమకు తెలియదు అనుకున్నప్పుడు వారిని వదిలేయాలి. ఎవరి నమ్మకాలు వారివి అనుకుంటూ.. ఎవరి పని వారు చేసుకోవాలి. కానీ.. ఈ మధ్య దేశంలో ఒకవిధమైన పరిస్థితి తలెత్తుతోంది. తమ దేవుడిని ప్రశ్నిస్తే.. ఆ ప్రశ్న, అదివేసిన వారు ఉండొద్దు అనే ప్రమాదకర ధోరణి పెచ్చరిల్లుతోంది. అది రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రానికే విరుద్ధం. అది దేవున్ని ప్రశ్నించేవాళ్లకే కాదు.. దేవుడిని అనుసరించే వాళ్లకు సైతం నష్టం చేకూరుస్తుంది.
ఇవాళ దేవుడి విషయంలో ప్రశ్నించొద్దని ఒకరు కోరుకుంటే.. రేపు ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దని మరొకరు బెదిరిస్తారు. ఇంకొకరు పార్టీని, పాలనను నిలదీయొద్దని హెచ్చరిస్తారు. ఇలా.. ఎవరికి నచ్చిన విషయాలను వారు మోసుకుంటూ.. తమను ప్రశ్నిస్తే అంతుచూస్తామన్నట్టుగా ముందుకు సాగితే.. ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం వాటిల్లుతుంది. అందువల్ల.. ప్రశ్న మిగలాలి. ప్రశ్న ద్వారానే సరికొత్త ఆలోచన పురుడు పోసుకుంటుంది. సమాజ పురోభివృద్ధికి ప్రశ్నే దోహదం చేస్తుంది. ఈ విషయం తెలియనివారు తమ దేవుడిని ప్రశ్నించాడనో.. తమ నాయకుడిని నిలదీశాడనో.. కత్తి మహేష్ చనిపోవడాన్ని సంబరాలుగా జరుపుకోవడం వారి మనస్తత్వాన్ని, అవగాహనను ప్రతిబింబిస్తుంది. ఇది సమాజానికి ఏ మాత్రం మంచిది కాదు.