Liberation Day- BJP: తెలంగాణ విమోచన దినం ఈ ఏడాది అధికారికంగా నిర్వమించాలని కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్‌లో నిర్వహించే వేడుకలకు హాజరు కావాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఈమేరకు కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులకు ఆహ్వానం కూడా పంపించారు. మరోవైపు ఇదే కార్యక్రమాన్ని సమైక్యత దినంగా మూడు రోజులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 16, 17, 18 తేదీల్లో నిర్వహించే కార్యక్రమాలతో షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్వహించే ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకలను తలదన్నేలా ఉండాలని కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. ఈమేరకు ఉత్సవాలను నాలుగు రోజులు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ఒక్క రోజుకే పరిమితం కాకుండా
సెప్టెంబర్ 17పై తెలంగాణ బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. వేడుక కేవలం ఆ ఒక్కరోజుకే పరిమితం కాకుండా నాలుగు రోజుల ముందు నుంచే రాష్ట్రంలో హడావుడి చేయాలని ప్లాన్ చేస్తోంది. 2023లో అధికారమే లక్ష్యం దూకుడు పెంచిన బీజేపీ అందుకోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటోంది. ఇప్పుడు సెప్టెంబర్ 17, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అందుకు వేదికగా మార్చుకుంటోంది కాషాయదళం. సెలబ్రేషన్స్ కేవలం ఆ ఒక్కరోజుకు పరిమితం చేయవద్దని పార్టీ రాష్ట్రశాఖ నిర్ణయించింది. మూడు నాలుగు రోజుల ముందు నుంచే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ జనంలోకి వెళ్లేందుకు వ్యూహరచన చేస్తోంది. ఈమేరకు సికింద్రాబాద్‌లో సమావేశమైన ముఖ్య నేతలు తెలంగాణ విమోచన ఉత్సవాలు ఎలా జరపాలి? పార్టీపరంగా ఏం చేయాలో చర్చించారు. సెప్టెంబర్ 17కి ముందు సన్నాహక ప్రోగ్రామ్స్ చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించి, సెప్టెంబర్ 17న గ్రామగ్రామాన జెండా వందనం చేపట్టనున్నారు. అలాగే, పల్లెల్లో పోరాట స్ఫూర్తిని నింపేలా బురుజులను అలంకరించాలని కేడర్‌కు రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది.
పోరాట యోధుల భాగస్వామ్యం..
స్వాతంత్య్ర సమరయోధులు, నిజాం పాలనకు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధులను, వారి కుటుంబ సభ్యులను ఈసారి విమోచన దినోత్సవంలో భాగస్వాములను చేయాలని కమలనాథులు నిర్ణయించారు. అందుకోసం యోధుల కుటుంబాలను కలుస్తున్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం పోచారంలో స్వాతంత్య్ర సమరయోధుడు షాయుబుల్లాఖాన్ ఫ్యామిలీని కలిశారు. సెప్టెంబర్ 17న బీజేపీ నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. అలాగే, హైదరాబాద్ గోషామహల్‌లో మరో స్వతంత్ర సమరయోధుడు వందేమాతరం రామచందర్‌రావు కుటుంబ సభ్యులను కలిసి సన్మానించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యోధులు, వారి కుటుంబాలను గుర్తించే పనిలో పార్టీ ఉంది. వారందరికీ ఆహ్వానాలు పంపించాలని రాష్ట్ర శాఖ భావిస్తోంది.

అన్నీ ప్రజల సమక్షంలోనే జరిగేలా..
అధికారికంగా, పార్టీపరంగా విమోచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అవన్నీ ప్రజల సమక్షంలోనే జరిగేలా చూడాలని బీజేపీ రాష్ట్రశాఖ నిర్ణయించింది. అందులో ప్రజలనూ భాగస్వామ్యం చేయాలని అన్ని జిల్లా శాఖలకు సూచించింది. స్థానిక పరస్థితులు, టీఆర్‌ఎస్ ఇన్నేళ్లు వేడుకలు నిర్వహించకపోవడం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధికారికంగా నిర్వహించడానికి ముందుకు రావడం, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వేడుకల నిర్వహణకు కార్యచరణ ప్రకటించడం గురించి ప్రజలకు వివరించాలని ఆదేశించింది. విమోచన చరిత్రను కనుమరుగు చేసేలా సమైక్యత దినంగా ప్రకటించడం వెనుక ఉన్న శక్తుల గురించి, హిందూ సమాజంపై జరుగుతున్న దాడులు, కుట్రల గురించి కూడా తెలియజేసేలా కార్యక్రమాలు ఉండాలని జిల్లా అధ్యక్షుడకు సూచించింది. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను అధికారికంగా, వేర్వేరుగా నిర్వహించనుండడంతో రాష్ట్రంలో ఈసారి పండుగ వాతావరణం నెలకొనడం ఖాయం.