YSRCP MPs: సమకాలిన రాజకీయాంశాలపై ఇప్పుడు ప్రతిఒక్కరికీ అవగాహన ఉంది. తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది. గల్లి నుంచి ఢిల్లీ రాజకీయాలు ఇప్పుడు ఇట్టే తెలిసిపోతున్నాయి. సోషల్ మీడియా తెరపైకి వచ్చాక క్షణాల్లో సమాచారం చేరిపోతోంది. ఎంతటి లోతైన అంశంపైన అయినా చర్చించే సామర్ధ్యం పెరిగింది. ఇది కాదనలేం కానీ.. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఎవరికి ఎవరు శత్రువో.. ఎవరు మిత్రుడో అర్ధం కావడం లేదు. నిన్నటి వరకూ భక్తుడిగా మారి కీర్తించిన వారి నోటి నుంచే దూషణలు వస్తున్నాయి. మావాడు అన్న నోటి నుంచే ప్రత్యర్థితో చేయి కలిపి కుట్ర చేస్తున్నాడన్న మాటలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఇవి కామనే అయినా నేతలు ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చడం మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది. ఎవరికీ అంతుపట్టని రీతిలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు సమీపించే కొలదీ ఇటువంటి రంగుల మార్చే రాజకీయాలు తెరపైకి వస్తుండడం విశేషం.

రాష్ట్రంలో అధికార వైసీపీకి గత ఎన్నికల్లో ప్రజలు అంతుపట్టలేని మెజార్టీని కట్టబెట్టారు. 151 మంది ఎమ్మెల్యేలతో పాటు 23 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారు. అయితే మంది ఎక్కువ అయితే అన్న సామెత మాదిరిగా ….జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నవారు సైతం పలానా ఎంపీ ఎవరు? పలానా ఎమ్మెల్యే ఎవరు? అంటే మాత్రం చటుక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆ నియోజకవర్గం, ఆ జిల్లా వరకూ ఒకేకానీ.. పక్క జిల్లావారు సైతం ఆ ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లు చెప్పలేకపోతున్నారు. దీనిని అధిగమించేందుకో.. లేకుంటే తాము ఫేమున్న నాయకులం అని చెప్పుకునేందుకో.. కానీ ఇటీవల అధికార పార్టీ ఎంపీలు మీడియా ముందు తెగ హడావుడి చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా మరిచిపోయిన రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ తో తెరపైకి వస్తున్నారు.
రంగయ్య, రెడ్డప్ప, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి వారు అసలు వైసీపీ ఎంపీలేనన్న విషయం చాలామందికి తెలియదు. అంతెందుకు వైసీపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ కూడా పెద్దగా విని ఉండరు. అటువంటి వారు మీడియా ముందుకొచ్చి భీకర ప్రకటనలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా లేనిదే రాష్ట్రం అభివృద్ధి కాదన్న రేంజ్ లో ప్రకటనలు ఇస్తున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెబుతోంది. కానీ తాము అడుగుతునే ఉంటామని వైసీపీ ఎంపీలు చెప్పుకొచ్చేవారు. గత మూడేళ్లుగా వీరి అడిగింది లేదు. కానీ ఇప్పుడు ఉన్నపలంగా ప్రత్యేక హోదా గళమెత్తుకున్నారు. అవసరమైతే లోక్ సభలో ఒక ప్రైవేటు బిల్లు పెడతామని ప్రకటించారు. అయితే ఈ ప్రైవేటు బిల్లుపై స్టడీ చేశారో లేదో కానీ.. ప్రకటన రూపంలో పోరాటానికి సై అన్నట్టు తేల్చేశారు.

అయితే ఎంపీల వాయిస్ వెనుక ప్రజాగ్రహమే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర బడ్జెట్ తో ఏపీకి ఒరిగిందేమీ లేదు. పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటించి ఏపీ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. అటు విభజన హామీల ప్రస్తావన లేదు. ప్రత్యేక కేటాయింపులు లేవు. ఇటువంటి సమయంలో 23 మంది వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నట్టు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 25 మంది ఎంపీలను ఇవ్వండి ఇట్టే ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ హామీని గుర్తుచేస్తున్నారు. ఎంపీలు రాజకీయ ప్రయోజనాల కోసం లాబియింగ్ కు పరిమితమయ్యారే కానీ రాష్ట్ర ప్రయోజనాలకు కాదని ఇంటా బయట ఒత్తడిని ఎదుర్కొంటున్నారు. అందుకే హోదా కోసం ప్రత్యేక బిల్లు అన్న గళం ఎత్తుకున్నారు. ఇందులో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. కానీ మూడున్నరేళ్లుగా గోడ చాటుకు గురైన ఎంపీలు మాత్రం మీడియా ముందుకు వచ్చి మెరిసిపోతున్నారు.