దేశంలో లాక్డౌన్ అమలు తర్వాత నగరాల్లో అడవి జంతుల సంచారం ఎక్కువగా కన్పిస్తున్నాయి. అడవీ ప్రాంతాలకు సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో అడవి జంతువుల సంచారం కన్పించడం సహజమే. అయితే హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఇటీవల చిరుతల సంచారం ఎక్కువైంది. దీంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. గత నెలరోజుల క్రితం హైదరాబాద్ నగరంలో ఓ చిరుత కలకలం రేపింది. చిరుత సంచారంతో జనం భయాందోళనకు గురయ్యారు. దీంతో సిటీ జనం కంటిమీద కునుకు దూరమైన సంగతి తెల్సిందే.
తాజాగా హైదరాబాద్ లో మరో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో చిరుత కన్పించింది. చిరుత సంచరించే దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. చిరుతను సీసీ కెమెరాలో చూసిన వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది షాక్‌కుగురై వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ అధికారులు అక్కడికి చేరుకొని చిరుత కోసం గాలిస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో వరుసగా చిరుతలు సంచరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. లాక్డౌన్ అమలు తర్వాతే అడవి జంతుల సంచారం నగరాల్లో ఎక్కువగా కన్పిస్తుండటం గమనార్హం.