Pawan Kalyan Alliance: వైసీపీ విముక్త ఏపీకి పవన్ గట్టిగానే నిర్ణయించుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకల అనంతరం పార్టీ శ్రేణులనుద్దేశించి పవన్ మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల వ్యూహాలు, రాష్ట్రాభివృద్ధి ఇలా అన్ని అంశాలపై కులంకుషంగా మాట్లాడారు. వైసీపీ రాష్ట్రాన్ని 25 సంవత్సరాల పాటు వెనక్కి తీసుకెళ్లిందని..మరోసారి చాన్సిస్తే మాత్రం మరో పాతికేళ్లు వెనక్కి తీసుకెళుతుందని కామెంట్స్ చేశారు. వైసీపీ ఏలుబడిలో అన్నిరంగాలు దగాకు గురయ్యారని.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. తనకు అధికారమే పరమావధి కాదని., ప్రజలు బలంగా కోరుకుంటేనే తాను సీఎం పీఠంపై కూర్చోగలనని తేల్చిచెప్పారు. ప్రజలను ఆలోచింపజేసే విధంగా కీలక ప్రసంగం చేశారు.

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని గత కొద్దిరోజులుగా పవన్ చెబుతూ వస్తున్నారు. దీంతో పొత్తులకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ముఖ్యంగా టీడీపీ విషయంలో సానుకూలంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అటు బీజేపీని సైతం మిత్రపక్షంగా చూస్తున్నారు. 2014 నాటి ఎన్నికల ముఖ చిత్రం రిపీట్ చేయాలని చూస్తున్నారు. అయితే బీజేపీ నుంచి సానుకూలత లేదు. జనసేన వరకూ ఓకే చెబుతున్నా టీడీపీ విషయంలో మాత్రం బీజేపీ చాలా క్లియర్ కట్ గా ఉంది. గత అనుభవాలతో టీడీపీతో కలిసేది లేదని తేల్చిచెబుతోంది. ఈ నేపథ్యంలో పవన్ తాజాగా చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాష్ట్రం గురించి ఆయన బాధ్యతతో చేసిన వ్యాఖ్యలు అటు తనతో కలవబోయే పార్టీలకు, కలిసి నడవాలనుకున్న వారికి గట్టి హెచ్చరికలే పంపినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

వైసీపీ పాలనలో అన్నిరంగాలు కుదేలయ్యాయని.. రాష్ట్రం దారుణంగా దెబ్బతిందని పవన్ భావిస్తున్నారు. అందుకే వైసీపీని అధికార పీఠం నుంచి దూరం చేయాలన్న ఒకే ఒక ఆశయంతో ముందుకు సాగుతున్నట్టున్నారు. వైసీపీ పోతే కానీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలేమని భావిస్తున్నారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చినా.. మిశ్రమ ప్రభుత్వం అధికారం చేపట్టినా రాష్ట్ర బాధ్యత తనదిగా చెప్పుకొస్తున్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రైతాంగానికి ప్రోత్సాహం..ఇలా అన్ని అంశాలపై తనకు ఒక అవగాహన ఉందని చెబుతున్నారు. మన ముందున్న కర్తవ్యం వైసీపీని సాగనంపడమేనన్న బలమైన సంకేతం అటు జనసేన శ్రేణులు, ఇటు మిత్ర పక్షాలు, రాష్ట్ర ప్రజలకు గుర్తిచేసేలా పవన్ దిశ నిర్దేశ్యం చేసినట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి.