
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై కొద్ది కాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతో ఆశావహులు అంచనాల్లో మునిగిపోతున్నారు. సామాజిక సమీకరణల లెక్కలు వేస్తూ తమకు పదవి ఖాయమని భావిస్తూ అధినేత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నారు. జగన్ ప్రాపకం పొందేందుకు నానా తంటాలు పడుతున్నారు. మంత్రివర్గంలో చోటు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఇది సంచలనంగా మారింది. నేతల హడావిడితో రాష్ర్టంలో రాజకీయం వేడెక్కుతోంది.
ఇప్పటికే సీఎం జగన్ మదిలో జాబితా సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. ఏ ప్రాంతాల్లో ఎవరిని తీసుకోవాలనే దానిపై ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అయితే మంత్రివర్గం కూర్పుపై ఇప్పటికే పలువురి పేర్లు జాబితాలో ఉంచినట్లు తెలుస్తోంది. అందులో సర్వేల వారీగా వారి బలాబాలను అంచనా వేసి వారికి ఏ శాఖలు కేటాయించాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
పాత మంత్రులను అందరిని మార్చాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొందరిని ఉంచి ఇంకొందరిని తీసేస్తే బాగుండదని భావించి అందరిని పక్కన పెట్టి కొత్త వారికే అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పనితనం ఆధారంగా వారి స్థాయిని బట్టి వారిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మార్పులు చేర్పులకు ముహూర్తం ఎప్పుడో ఇంకా ఖరారు కాలేదు.
ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే పలువురు ఆశలు పెంచుకున్నారు. తమ జిల్లా సమీకరణల దృష్టా తనకే అవకాశం ఖాయమని భావిస్తున్నారు. ఇలా ఆశల డోలికల్లో ఊగిసలాడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. కానీ జగన్ మదిలో ఏముందో ఎవరికి అర్థం కాదు. మంత్రివర్గ విస్తరణ చేపడితే తప్ప తెలిసే అవకాశమే లేకుండా పోయింది. దీంతో వైసీపీ నేతల ఆశలు ఏ మేరకు నెరవేరతాయో వేచి చూడాల్సిందే.