https://oktelugu.com/

BRS Party: బీఆర్ఎస్ కంచుకోటకు బీటలు.. పార్టీని చీల్చే దిశగా నేతల అడుగులు?

BRS Party: పదేళ్లు కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు సాగించిన అరాచకాలపై ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణితోపాటు, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 19, 2024 12:27 pm
    Leaders steps towards splitting the BRS party
    Follow us on

    BRS Party: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి బీఆర్‌ఎస్‌ ఇంకా తేరుకోకముందే.. ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు బీఆర్‌ఎస్‌ నుంచి ‘హస్త’గతమయ్యాయి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సొంత పార్టీ మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాసం ప్రకటిస్తున్నారు. ఇలా ఇప‍్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ ఖాతాలో పడ్డాయి. ఇంకా అనేక మున్సిపాలిటీలు హస్తగతం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అధికారంలో లేని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. చేష్టలుడిగి చూస్తున్నారు. ఈ జాబితాలో బీఆర్‌ఎస్‌ కంచుకోట అయిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌కు చెందిన కార్పొరేటర్లు పార్టీని చీల్చే దిశగా పావులు కదుపుతున్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నంతకాలం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు చేసిన సదరు నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరేందుకు యత్నిస్తున్నారు. తొమ్మిది మంది కార్పొరేటర్లు ఇప్పటికే హస్తం పార్టీతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నాలు చేసు‍్తన్నారు.

    కబ్జాదారులపై పోలీసుల కొరడాతో..
    కరీంనగర్‌లో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ అండతో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, నేతలు పదేళ్లు అరాచకాలు సాగించారు. పేద, మధ్య తరగతి భూములను కబ్జా చేసి, సెటిల్‌మెంట్ల పేరుతో డబ్బులు వసూలు చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. ఇక మాజీ మంత్రివర్యులు కూడా తక్కువేం తినలేదు. తమ అనుచరులు చేస్తున అరాచకాలను అడ్డుకోకపోగా, అండగా నిలిచారు. ఇక జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పేరుతో ఎస్సారెస్పీ భూమలకు గంగుల కమలాకర్‌ ఎసరు పెట్టారు. మూడెకరాలను జర్నలిస్టులకు పంచి 10 ఎకరాలు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే అది జరిగేది. కరీంనగర్‌లో గంగుల గెలిచినా.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకపోవడంతో ఈ గుట్టు రట్టయిది.

    కబ్జాల వివరాలు సేకరిస్తున్న మంత్రి..
    పదేళ్లు కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు సాగించిన అరాచకాలపై ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణితోపాటు, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పొన్నం ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్పొరేటర్లు చేసిన కబ్జాలు, భూదందాలపై నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలను ఆదేశించారు. ఈమేరకు స్థానిక నేతలు కబ్జా నేతల చిట్టా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా పోలీస్‌ బాస్‌ కూడా బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, గతంలో మాజీ మంత్రి అనుచరులమని చెప్పుకుని కొంతమంది నాయకులు సాగించిన భూ దందాలపై దృష్టిపెట్టారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కబ్జాదారలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు.

    కాంగ్రెస్‌వైపు కబ్జా నేతల చూపు..
    ఒకవైపు మంత్రి, మరోవైపు పోలీసులు బీఆర్‌ఎస్‌ నేతలు, కరీంనగర్‌ కార్పొరేటర్ల సాగించిన అరాచకాల చిట్టా విప్పుతున్నారు. దీంతో కబ్జా నేతల్లో అలజడి మొదలైంది. ఇప్పటికే భూకబ్జా కేసులో కార్పొరేటర్‌ తోట రాములు, బీఆర్‌ఎస్‌ నాయకుడు తోట రాములు అరెస్ట్‌ అయ్యారు. దీంతో తమ వంతు ఎప్పుడు వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కొందరు గులాబీ పార్టీ వీడి హస్తం గూటికి చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ శరణు వేడుకునే ప్రయత్నం చేసు‍్తన్నారు. ఈమేరకు స్థానక కాంగ్రెస్‌ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. పొన్నం అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

    బీఆర్‌ఎస్‌ మురికి కాంగ్రెస్‌కు..
    మంత్రి పొన్నం ప్రభాకర్‌.. ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకవైపు కబ్జాదారులపై కొరడా ఝళిపించాలని ఆదేశించిన మంత్రి.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌లోని అవినీతి, భూకబ్జా నేతలు, కార్పొరేటర్లకు అపాయింట్‌ మెంట్‌ ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే.. బీఆర్‌ఎస్‌ మురికి కాంగ్రెస్‌ అంటడం ఖాయం. దీని ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీలో అక్రమాలను వెలికి తీసిన మంత్రి.. ఎస్సారెస్పీ భూమి అన్యాక్రాంతం కాకుండా ఆపారు. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌లో ఉండి అరాచకాలు చేసిన నేతలు, కార్పొరేటర్లను ఇప్పుడు కాంగ్రెస్‌లో చేర్చుకుంటే మంత్రిపై, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతింటుందని పేర్కొంటున్నారు.