Chandrababu Health: “మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి.. కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు.. అది కరెక్ట్ కాదు “.. ఆ మధ్యన వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ పలికే డైలాగ్ ఇది. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు విషయంలో సైతం ఇదే రిపీట్ అవుతోంది. తాను ఏడుపదుల వయసులో కూడా యువకుడితో సమానంగా పనిచేయగలనని చెప్పుకొచ్చిన చంద్రబాబు… ఇప్పుడు ఏపీ సిఐడి అధికారులు అరెస్టు చేయడంతో తనకు అనారోగ్యమని చెప్పడం విశేషం.
నంద్యాలలో ఉన్న చంద్రబాబును అరెస్టు చేసేందుకు ఏపీ సిఐడి అధికారులు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు అండ్ కో సిఐడి అధికారులను ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ తరుణంలో చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ ఆయన తరపు న్యాయవాదులు, టిడిపి నాయకులు చెప్పుకు రావడం విశేషం. గత కొద్ది రోజులుగా వరుస రాజకీయ పర్యటనలతో చంద్రబాబు బిజీగా ఉన్నారు. కానీ ఆయన అనారోగ్యం గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఎప్పుడైతే అరెస్ట్, జైలు అని చెప్పగానే చంద్రబాబులో వృద్ధాప్యం, అనారోగ్యం తెరపైకి రావడం గమనార్హం.
ప్రస్తుతం చంద్రబాబు హైబీపీ, డయాబెటిస్తో బాధపడుతున్నట్లు సిఐడి అధికారులు దృష్టికి న్యాయవాదులు తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని మీడియా కూడా వారు వివరించారు. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నాయి. పోలీసులు ఎక్కడికి అక్కడే ముందస్తు అరెస్టులు చేస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. కొందరు టిడిపి నాయకులు కార్యకర్తలు, రహదారుల పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అయితే చంద్రబాబు అరెస్టును సానుభూతి కోసం వాడుకోవాలన్న ప్రయత్నంలో భాగంగానే అనారోగ్య సమస్యలు తెరపైకి తెచ్చినట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
వాస్తవానికి చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం జగన్ తనను ముసలోడిగా అభివర్ణించడాన్ని తప్పుపట్టారు. తాను జగన్ కంటే యువకుడినని.. ఆరోగ్యపరంగా ఫిట్ గా ఉన్నానని .. రోజులో 16 గంటలు పని చేయగలనని సగర్వంగా ప్రకటించేవారు. తాను ఆరోగ్య క్రమశిక్షణ పాటిస్తానని.. ఎటువంటి శారీరక రుగ్మతలు తన దరి చేరవని చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు అటువంటి చంద్రబాబు కి హై బీపీ, షుగర్ ఉన్నాయని చెబుతుండడం విమర్శలకు తావిస్తోంది.