Lawyer Sidharth Luthra: చంద్రబాబు కోసం సుప్రీంకోర్టుకే నీతులు చెబుతున్న ఆయన లాయర్

ఏసీబీ కోర్టు తో పాటు హైకోర్టులో సైతం లూధ్ర బలమైన వాదనలు వినిపించారు. అయినా సరే చంద్రబాబుకు విముక్తి కలగలేదు. మరోవైపు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. తక్షణం కేసును విచారణ చేపట్టాలని కోరారు.

Written By: Dharma, Updated On : October 1, 2023 11:51 am

Lawyer Sidharth Luthra

Follow us on

Lawyer Sidharth Luthra: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు విచారణ పై తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఆసక్తి ఉందో.. అటు కేసు వాదిస్తున్న అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్ర పేరు సైతం మార్మోగిపోయింది. ప్రాథమిక హక్కులు, ఎన్నికల సంస్కరణలు, క్రిమినల్ చట్టాలు, విధానపరమైన అంశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున అనేక కేసుల్లో ఆయన వాదనలు వినిపించారు. వైట్ కాలర్ నేరాలు, సైబర్ మాసాలు, క్రిమినల్ చట్టాలకు సంబంధించిన కేసులను వాదించడంలో లూధ్రకు మరొకరు సాటి లేరు అన్న టాక్ ఉంది. అందుకే చంద్రబాబు తన కీలక కేసులన్నీ సిద్ధార్థ లూధ్రకు అప్పగించేవారు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసును కూడా ఆయనకే అప్పగించారు.

ఏసీబీ కోర్టు తో పాటు హైకోర్టులో సైతం లూధ్ర బలమైన వాదనలు వినిపించారు. అయినా సరే చంద్రబాబుకు విముక్తి కలగలేదు. మరోవైపు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. తక్షణం కేసును విచారణ చేపట్టాలని కోరారు. అయితే న్యాయమూర్తులు మాత్రం వచ్చే వారానికి వాయిదా వేశారు. అంత అత్యవసర కేసుగా భావించడం లేదన్నట్టు సంకేతాలు ఇచ్చారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈనెల 3న పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇంతకుముందున్న కేసుల దృష్ట్యా అక్టోబర్ 6న విచారణకు రానున్నట్లు కోర్టు వర్గాలు చెబుతున్నాయి. ఇటువంటి తరుణంలో లాయర్ సిద్ధార్థ లూథ్ర ఆసక్తికర ట్విట్ చేశారు.

సుప్రీంకోర్టుకు సుద్దులు చెప్పే విధంగా ఈ ట్విట్ ఉండడం విశేషం. చంద్రబాబు కేసు విచారణలో జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ ట్విట్ పెట్టినట్లు ఉంది. ఆయన పెట్టిన ట్విట్ ఏంటంటే ” న్యాయమూర్తులు త్వరితగతిన తీర్పులు ఇవ్వడం ముఖ్యం. గతంలో ఓ కేసు ప్రాథమిక విచారణ అనంతరం… 14 నెలల తర్వాత హైకోర్టు జడ్జి ఒకరు తీర్పునిచ్చారు. జరిగిన జాప్యం పై ఆయన క్షమాపణ కోరారు. అందుకే సత్వర తీర్పులు ఇవ్వాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉంది ” అంటూ సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సిద్ధార్థ్ ట్విట్ చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో రెండు సార్లు చేశారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైనప్పుడు ” కనుచూపుమేరలో న్యాయం కనిపించడం లేదు. అందుకే పోరాటమే శరణ్యం” అంటూ ట్విట్ చేశారు. హైకోర్టులో క్వాష్ పిటీషన్ కొట్టి వేసినప్పుడు ” ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది.. కొత్త రోజు వెలుగునిస్తుంది.. రాత్రి తర్వాత మీ తెల్లవారుజాము… ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుంది” అంటూ ట్విట్ చేశారు. తాజాగా మరో ట్వీట్ చేయడం విశేషం.చంద్రబాబు కేసు విచారణలో జాప్యం జరుగుతున్నందున మనస్థాపంతోనే ట్విట్ చేసినట్లు తెలుస్తోంది.

సిద్ధార్థ్ లూధ్ర దేశంలోనే టాప్ క్రిమినల్ లాయర్స్ లో ఒకరు. మూడు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. 2010 నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. 2012 జూలై నుంచి 2014 మే వరకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా కూడా పనిచేశారు. దేశంలో కీలక కేసులను వాదించారు. తెహల్కా కేసులో 2002లో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాన్డేజ్ను లూధ్ర క్రాస్ ఎగ్జామ్ చేశారు. ఖరీదైన లాయర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి చరిత్ర ఉన్న సిద్ధార్థ్ చంద్రబాబు కేసులో అసహనం చూపుతుండడం విశేషం.