Indian Student Death In Ukrain: ఉక్రెయిన్ లోని ఖార్కివ్ లో రష్యా చేసిన దాడిలో ఒక భారతీయ వైద్య విద్యార్థి మృతిచెందడం విషాదం నింపింది. ఆ యుద్ధంలో చనిపోయిన మొదటి భారతీయుడు ‘నవీన్’నే కావడం భారతీయులను కదిలించింది. భారతీయులందరినీ క్షేమంగా ఇంటికి తీసుకువస్తున్న క్రమంలోనే కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి 21 ఏళ్ల నవీన్ మృతి ఘటన విషాదం నింపింది. అయితే భారతీయులను సురక్షితంగా కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొస్తోంది. రష్యా కూడా భారతీయ జెండాలతో వెళ్లే వారిని విడిచిపెడుతోంది. మరి విద్యార్థి నవీన్ మరణం ఎలా సంభవించిందనే దానిపై షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.
రష్యా ఖార్కివ్ పై భీకరమైన దాడులు చేస్తోంది. అదే సమయంలో బంకర్ లో భారతీయ మెడికల్ విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆకలి వేయడంతో విద్యార్థుల కోసం నవీన్ ఒక్కడే మధ్యాహ్నం ఆహారం అందిస్తున్న ప్రాంతానికి వెళ్లాడు. క్యూలో ఉన్నాడు. అతడితోపాటు అతడి స్నేహితుడు కూడా బయటకు వెళ్లాడు.
క్యూలో ఉన్న సమయంలో ఒక్కసారిగా రష్యా బలగాలు క్షిపణి దాడి చేశారు. అది ఎటో వెళ్లబోయి నవీన్ ఉన్న ప్రాంతంలోనే పడింది. దీంతో నవీన్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతడితోపాటు ఉన్న మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు.
నవీన్ సెల్ ఫోన్ అక్కడి ఉక్రెయిన్ మహిళకు దొరకడంతో ఆమె నవీన్ టీంలోని ఇతర విద్యార్థి పూజా ప్రహరాజ్ కు తెలిపింది. దీంతో నవీన్ మరణించాడన్న విషయం వెలుగుచూసింది. తమకు ఆహారం తీసుకురావడానికి వెళ్లి మృతిచెదండంతో విద్యార్థులంతా బోరుమన్నారు. తమ కోసం వెళ్లిన నవీన్ తిరిగి రాని లోకాలకు తరలిపోవడాన్ని వారు జీర్ణించుకోవడం లేదు.
Also Read: Ukraine-Russia War: ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థినీలను ఎత్తుకెళుతున్న రష్యా సైనికులు?
నవీన్ అదే రోజు ఉదయం తండ్రికి ఫోన్ చేసి తాము దగ్గరిలోని బంకర్ లో తలదాచుకున్నామని.. తమతోపాటు ఇంకా చాలా మంది ఉన్నారని.. తినడానికి, తాగడానికి ఏమీ దొరకడం లేదని ఆకలిగా ఉందని తండ్రికి చెప్పాడు.ఇక ఉదయం తండ్రితో నవీన్ చివరి మాటలు మాట్లాడాడు.. ‘రైళ్లు రాకపోకలు ప్రారంభమయ్యాయని.. రోజుకు మూడు సార్లు ఉదయం 6, 10, మధ్యాహ్నం 1 గంటకు రైళ్లు వెళుతున్నాయని’ తండ్రికి చెప్పాడు. దీంతో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకో అని నవీన్ తండ్రి సూచించారు. అవే చివరి మాటలు అని ఆ తండ్రి బోరుమన్నాడు.
Also Read: Russia Ukrainewar: ఒంటరివాడైన పుతిన్..: పరాభావం తప్పదా..?