2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి చంద్రబాబు పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. రాష్ట్రంలో టీడీపీ రోజురోజుకు బలహీనపడుతోంది. ఐదేళ్ల టీడీపీ పాలన ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం, విశ్వాసం పోయేలా ఉండటంతో భవిష్యత్తులో టీడీపీ పుంజుకోవడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చంద్రబాబుపై సీనియర్ ఎన్టీఆర్ సతీమణి, ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబును జైలుకు పంపేంత వరకు తాను వదలనని ఆమె అన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకునే ఉద్దేశం తనకు లేదని.. తాను కేసును విత్ డ్రా చేసుకోవాలంటూ చంద్రబాబు తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె వెల్లడించారు. నిన్న హైదరాబాద్ ఏసీబీ కోర్టులో చంద్రబాబు ఆస్తులకు సంబంధించి విచారణ జరగగా లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొందరు కేసును విత్ డ్రా చేసుకోవాలంటూ తనపై ఒత్తిడిని పెంచుతున్నారని.. తనకు మాత్రం కేసును విత్ డ్రా చేసుకునే ఉద్దేశం లేదని ఆమె పేర్కొన్నారు. తనకు ఏసీబీ కోర్టులో న్యాయం జరగని పక్షంలో హైకోర్టుకు వెళతానని లక్ష్మీపార్వతి చెప్పారు. చంద్రబాబును జైలుకు పంపకుండా వదలనని.. న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
లక్ష్మీపార్వతి పిటిషన్ లో చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారని.. చంద్రబాబు ఆస్తులపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని ఆమె పేర్కొన్నారు. 1978 నుంచి 2005 వరకు చంద్రబాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టుకు సమర్పించారు. ఏసీబీ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా పడింది. లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.