Lakshmi Parvati- Unstoppable With NBK: అన్ స్టాపబుల్ షోలో మరో సంచలనం చోటు చేసుకోనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫైర్ బ్రాండ్ లక్ష్మీ పార్వతిని బాలయ్య ఇంటర్వ్యూ చేయనున్నారట. ఉప్పు నిప్పు ఒక చోటు చేరితే ఎలా ఉంటుందో బాలయ్య-లక్ష్మీ పార్వతి కలిస్తే అలా ఉంటుంది. వీరిద్దరివీ వేరువేరు దారులు. బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే కాగా లక్ష్మీ పార్వతి వైసీపీ పార్టీ సానుభూతిపరురాలు. అలాగే ఎన్టీఆర్ పతనం వెనుక నారా చంద్రబాబు ఉన్నాడని ఆమె ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు. బాబుతో బాలయ్యతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చేతులు కలిపారని ఆమె పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో బాలయ్య షోకి ఆమె వస్తే ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ఎందుకంటే బాలయ్య షో డిప్లొమాటిక్ గా సాగదు. గెస్ట్ జీవితంలో గల కాంట్రవర్సీలు, వివాదాలు తెరపైకి తెస్తాడు. ఫస్ట్ ఎపిసోడ్ కి నారా చంద్రబాబు నాయుడు గెస్ట్ గా వచ్చిన నేపథ్యంలో ఆగస్టు సంక్షోభం గురించి అడిగాడు. మీ జీవితంలో అతిపెద్ద నిర్ణయం ఏమిటని బాలయ్య చంద్రబాబును అడగడం జరిగింది. దానికి… ఆరోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా? నా మాట వినమని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడాను అని చంద్రబాబు వెల్లడించారు.
చంద్రబాబు రాజకీయ జీవితంలో మాయని మచ్చగా, వెన్నుపోటు పర్వంగా ఉన్న ఆ సంఘటన చర్చించడం నిజంగా సాహసం. ఆ లెక్కన లక్ష్మీ పార్వతి జీవితంలో అనేక కాంట్రవర్సీలు ఉన్నాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాస్తాను అంటూ ఆమె ఆయనకు దగ్గర కావడం, రచయితగా వచ్చి భార్య స్థానం పొందడం, లక్ష్మీ పార్వతి కోసం కుటుంబాన్ని కూడా ఎన్టీఆర్ నిర్లక్ష్యం చేశాడన్న అపవాదు.. ఇలా అనేకం ఉన్నాయి.

ఈ క్రమంలో అన్ స్టాపబుల్ సీజన్ 2 లో లక్ష్మీ పార్వతి పాల్గొనబోతున్నారనే వార్త సంచలనం మారింది. ఇదే జరిగితే ఆ ఎపిసోడ్ చరిత్ర లిఖిస్తుంది. ఆహా యాప్ కి ఎక్కడలేని చందాదారులను తెచ్చిపెడుతుంది. ఈక్రమంలో బాలయ్య ఆ సాహసం చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. షోకి బాబును పిలిచి బాలకృష్ణ ఆయన ఇమేజ్ ఎలివేట్ చేశారని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఇంటర్వ్యూ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే సమయంలో లక్ష్మీ పార్వతిని పిలిచి బాలయ్య ఇంటర్వ్యూ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.