
UP govt MOU`s : ప్రభుత్వాధినేతలు పెట్టుబడులను ఆహ్వానిస్తారు. పెట్టుబడిదారులు వస్తారు. వేల కోట్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పెట్టుబడులు పెడుతున్నట్టు చెబుతారు. ఆ తర్వాత పత్తా లేకుండా పోతారు. ఎన్ని కోట్లు నికరంగా పెట్టుబడులు పెట్టారో.. ఎన్ని కోట్లు ఒప్పందాలకే పరిమితమయ్యాయో ఎవరూ చెప్పరు. అన్ని లక్షల కోట్లు తెచ్చాం.. ఇన్ని లక్షల కోట్లు తెచ్చాం అంటూ ఢంకా బజాయిస్తారు. పెట్టుబడులు.. వాటి వెనుక ఉన్న రహస్యాలను ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీకి 20 లక్షల కోట్లు వచ్చినట్టు టీడీపీ నేతలు చెబుతారు. వాస్తవం ఏంటంటే 20 లక్షల కోట్లకు ఎంవోయూలు మాత్రమే కుదుర్చుకున్నారు. ఆ 20 లక్షల కోట్లు నికరంగా పెట్టుబడులుగా మారలేదు. 20 లక్షల కోట్లలో కేవలం 40 నుంచి 50 వేల కోట్లు పెట్టుబడులుగా మారాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ వాదనను టీడీపీ ఒప్పుకోవడంలేదు. అంతర్జాతీయ స్థాయి కియా కార్ల పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చామని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ హయాంలో ఏపీకి చిల్లిగవ్వ కూడా పెట్టుబడిగా రాలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వాస్తవంగా ఇన్ని లక్షల కోట్లు నికర పెట్టుబడిగా మారితే .. ఆ రాష్ట్ర పరిస్థితి మరోలా ఉంటుంది. కేవలం ఎంవోయూలతో సరిపెట్టకుండ వాటిని ఆచరణలోకి తీసుకురాగలిగితే అంతకంటే అభివృద్ధి ఉండదు. టీడీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులను వైసీపీ కొనసాగించదు. ఒప్పందాల్లో తప్పిదాలు ఉన్నాయంటూ కొర్రీలు పెడతారు. దీంతో పెట్టుబడిదారులు మరో రాష్ట్రానికి తరలిపోతారు. ఏపీలో నెలకొన్న దౌర్భాగ్యం ఇదే. టీడీపీ హయాంలో కుదుర్చుకున్న ఎంవోయూలు వైసీపీ కొనసాగించగలిగితే ఏపీలో పారిశ్రామికాభివృద్ధి వేగం ఎలా ఉంటుందో ఊహించలేం. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. దీంతో పెట్టుబడిదారులు మరో రాష్ట్రానికి వెళ్తున్నారు.
గతంలో యూపీ నిత్యం కుల, మత ఘర్షణలతో అట్టుడుకుతుండేది. అక్కడికి పెట్టుబడిదారులు వెళ్లాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు ఏకంగా 33 లక్షల కోట్ల ఎంవోయూలు కుదుర్చుకున్నారంటే ఆశ్చర్యం మన వంతవుతుంది. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం వివిధ కంపెనీలతో 33 లక్షల కోట్ల ఎంవోయూలు కుదుర్చుకుంది. ఇన్ని లక్షల కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. యూపీ వైపు పెట్టుబడిదారులు పరుగులు తీయడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న కూలీ ధరలే అని చెప్పవచ్చు. తక్కువ కూలీ ఉన్న కారణంగా పరిశ్రమలు అటు వైపు వెళ్తున్నాయి. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూలీ ధరలు భారీగా పెరిగాయి. దీంతో పరిశ్రమలు ఇటవైపు కన్నెత్తి చూడటంలేదు. ఏపీ తరహాలో కాకుండా.. యూపీ ప్రభుత్వం ఎంవోయూలను ఆచరణలోకి తీసుకువెళ్లాలి. అప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుంది.