KVP Ramachandra Rao- Sharmila: వైఎస్ షర్మిళ కాంగ్రెస్ లో చేరడం వెనుక ఉన్నదెవరు? కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం వహించారా? అదృశ్య శక్తి ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చిన వైఎస్ కుటుంబం బలమైన కారణం లేనిదే తిరిగి ఆ పార్టీలో చేరుతుందా? అన్నది ఇప్పుడు సర్వత్రా అనుమానం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో.. ఆయన పదవిని కుమారుడు జగన్ కు ఇవ్వలేదని కుటుంబం సోనియా గాంధీతో విభేదించింది. నాటి ధిక్కారణకు జగన్ అక్రమ కేసులతో పాటు జైలు జీవితం అనుభవించారు కూడా. అటువంటిది వైఎస్ కుటుంబం తిరిగి సోనియాతో స్నేహం చేయడం మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ సృష్టిస్తోంది.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శత్రువులు మిత్రువులతారు.. మిత్రులు శత్రువులుగా మారిపోతారు. అవసరాలు ఎంతదాకైనా తీసుకెళతాయి. తండ్రి మరణంతో జగన్ కు అంతులేని సానుభూతి లభించింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. భర్త బతికున్నప్పుడు ఏనాడు బయటకు రాని విజయమ్మ కుమారుడి కోసం జనాల్లోకి వచ్చారు. నా కుమారుడ్ని ఆదరించండి అంటూ కన్నీరు పెట్టుకున్నారు. తన సోదరుడికి జరిగిన అన్యాయానికి షర్మిళ జీర్ణించుకోలేకపోయారు. ఏకంగా సోదరుడి కోసం సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అయితే తాము అనుకున్నట్టు జగన్ కు అధికారం దక్కింది. కానీ వారి పోరాటం, ఆరాటం నీరుగారిపోయింది. జగన్ ఆదరణ కరువైంది. వారిలో అంతర్మథనం ప్రారంభమైంది. అయితే అంతమాత్రానికి వారు కాంగ్రెస్ వైపు చూశారంటే మాత్రం వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందని తెలుస్తోంది.
ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైనా.. ఆ పార్టీలో ఎదిగిన నాయకులు చాలా మంది ఉన్నారు. వారికి ఇప్పటికీ కాంగ్రెస్ పైనే మక్కువ. కానీ ప్రత్యామ్నాయం లేక వైసీపీలో చేరవలసి వస్తోంది. పవర్ లేని పదవుల్లో కొనసాగాల్సి వస్తోంది. అయితే జగన్ వెంట అందరూ వెళ్లిపోయినా.. వైఎస్ఆర్ మనుషులు మాత్రం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. తమ నాయకుడికి నీడనిచ్చి… స్వేచ్ఛనిచ్చి.. అధికారమిచ్చిన కాంగ్రెస్ ను వీడలేమంటూ వారు ఆ పార్టీలోనే ఉండిపోయారు. ప్రధానంగా వైఎస్ఆర్ ఆత్మగా పిలవబడే కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ హైకమాండ్ కు కట్టుబానిసలా మారిపోయారు.
గత తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ లో ఉన్నా కేవీపీ అంతంతమాత్రంగానే సౌండ్ చేశారు. అయితే ఇప్పుడు షర్మిళ కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేవీపీ బయట కనిపిస్తున్నారు. వైఎస్ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడం వెనుక కర్నాటక నేత డీకే శివకుమార్ తో పాటు కేవీపీ పాత్ర ఉందని వార్తలు వస్తున్నాయి. షర్మిళ చేరికపై తనకు సమాచారం ఉందని కూడా కేవీపీ వెల్లడించడం వెనుక అనుమానాలు బలపడుతున్నాయి. షర్మిళ రాకతో ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని కేవీపీ ఆశాభావం వ్యక్తం చేయడం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్టు తెలుస్తోంది.