KCR Grandson Himanshu: ఏ ముహూర్తాన అయితే హైదరాబాదులోని గౌలిదొడ్డి పాఠశాలను ప్రారంభించాడు కానీ.. అక్కడ పరిస్థితులను ఒకప్పుడు చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నాడో గాని.. ఆనాటి నుంచి రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, వివిధ సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి మనవడే రాష్ట్రంలోని పాఠశాలల దుస్థితిపై కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే పాఠశాలలో దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నాయి. గౌలిదొడ్డి పాఠశాల ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు తెలంగాణలో పలుచోట్ల రోజుకొక నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే ప్రతి విషయంలో ప్రతిపక్షాలను టాకిల్ చేసే రాష్ట్ర ప్రభుత్వం.. ఈ విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండడం విశేషం.
వినూత్న నిరసన
హిమాన్షు గౌలిదొడ్డి పాఠశాలను అభివృద్ధి చేసిన నేపథ్యంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ వినూత్న రీతిలో స్పందించింది. ఒక ఫ్లెక్సీలో హిమాన్షును ఒకవైపు అభినందిస్తూ.. మరోవైపు సమస్యలపై నిలదీద్దాం రావాలి అంటూ స్వాగతం పలికింది.”కేవలం గౌలిదొడ్డి పాఠశాలను మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలను సమూలంగా మార్చివేద్దాం.. అవసరమైతే మీ తాత మీద కొట్లాడుదాం. కలిసి ఉద్యమిద్దం. మీ తాతను నిలదీద్దాం” అంటూ ప్లెక్సీలో పేర్కొంది. నిజామాబాద్ నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ” రాష్ట్రంలోని పాఠశాలల్లో బెంచిలు సరిగా లేవు. వర్షాలకు భవనాలపై పెచ్చులు ఊడిపోతున్నాయి. కరెంట్ షాక్, పాముకాటులో విద్యార్థులు మరణిస్తున్నారు.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలి. విద్యాశాఖ మంత్రి కళ్ళు తెరవాలి అంటూ” తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది.
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
మరోవైపు హిమాన్షు రావు గౌలిదొడ్డి పాఠశాలను ప్రారంభించిన అనంతరం తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశాడని, ఆయన మనవడి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గౌలిదొడ్డి పాఠశాలను ప్రారంభించిన తర్వాత హిమాన్షు రావు మాట్లాడిన మాటలను ప్రతిపక్ష పార్టీల నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.. ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన తెలంగాణ రాష్ట్రంలో వాటనే దక్కకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రతిపక్షాల నుంచి కాకుండా మనవడి నుంచి కెసిఆర్ పాలనకు వ్యతిరేకంగా స్వరం వినిపించడం ఒకింత ఆశ్చర్యకరమే. దీనిని ప్రతిపక్షాలు కూడా సకాలంలో ఒడిసి పట్టుకోవడం శుభ పరిణామమే.