
తెలంగాణలో గ్రేటర్ పోరు యుద్ధాన్ని తలపిస్తోంది. బీజేపీపై టీఆర్‌ఎస్.. టీఆర్‌ఎస్‌పై బీజేపీ మాటలయుద్ధం నడుస్తోంది. తాజాగా.. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రులు అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ తమపై చార్జిషీట్ ఎందుకు వేస్తుంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వృద్ధులను ఆదుకున్నందుకు తమపై చార్జిషీట్లు వేస్తారా..? తెలంగాణను అభివృద్ధి చేస్తున్నందుకా చార్జిషీట్ వేస్తారా..? అంటూ నిలదీశారు.
Also Read: కేసీఆర్ కు మూడోఫ్రంట్ పై ఎందుకంత ఆరాటం..?
తాము హైదరాబాద్‌కు ఏం చేశామో తాము చెప్పుకోగలమన్నారు. బీజేపీ ఏం చేసిందో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు అసత్యాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ పబ్బం గడుపుతోందని అన్నారు. ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారని.. బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. రైల్వే రంగాన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని నిలదీశారు. అన్నింటినీ అమ్మేయడమే బీజేపీ పాలసీ అని ఆరోపించారు. వారికి అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను.. చార్మినార్ గోల్కొండను కూడా అమ్మేస్తారని విమర్శించారు. ప్రధాని బుర్రకు కూడా తట్టని రైతు బంధును తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు.
రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా.. ఏ మాత్రం ఆలోచించకుండా లాక్‌డౌన్‌లు విధించి వలస కార్మికులను ఇబ్బందుల పాల్జేశారని ఆరోపించారు. వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చిందన్నారు. నెత్తిన మూట, సంకల బిడ్డను ఎత్తుకొని… కిలోమీటర్ల కొద్ది నడిచి వందలమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. వలస కార్మికుల ఆత్మలు సైతం మోదీపై చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. లక్షలమంది ఉపాధి కోల్పోయిన యువత సైతం మోదీపై చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు కేటీఆర్.
Also Read: హైదరాబాదీలకు ఉచితంగా ‘నమస్తే’ పెట్టిన టీఆర్ఎస్
కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నేతలు సైతం ఫైర్ అవుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రులు, ఆ పార్టీ పెద్దలు కూడా ఎలా స్పందిస్తారో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గ్రేటర్‌లో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. హోరాహోరీ పోరులో టీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు చివరకు దేశస్థాయికి చేరాయి. మరి.. చివరికి ఈ పోరులో ఎవరిది పైచేయిగా నిలుస్తుందో ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్