Samantha Political Stand: సినిమా తారలు పాలిటిక్స్ జోలికి పోరు. కొందరు మినహాయిస్తే మెజారిటీ స్టార్స్ తటస్థంగా వ్యవహరిస్తారు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు. సదరు పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలుగుతారు. అందుకే పొలిటికల్ ట్వీట్స్, సోషల్ మీడియా పోస్ట్స్ పై వాళ్ళు స్పందించరు. కాగా సమంత అనూహ్యంగా కేటీఆర్ ట్వీట్ లైక్ చేసి తన పొలిటికల్ స్టాండ్ ఏమిటో తెలియజేసింది. పరోక్షంగా ఆమె బీజేపీ పార్టీని వ్యతిరేకించినట్లయ్యింది.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. ఒకప్పుడు 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం ఒకటి రెండు రాష్ట్రాలకు పరిమితమైంది. తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలిన్స కాంగ్రెస్, నాయకుల మధ్య చీలికలు కారణంగా ఆ బాధ్యత సరిగా నిర్వహించలేకపోతుంది. దీన్ని క్యాష్ చేసుకుంటున్న బీజేపీ తెలంగాణా లో ఎదిగే ప్రయత్నం చేస్తుంది. గత ఐదేళ్లలో బీజేపీ వేగంగా పుంజుకుంది. అధికార తెరాస ప్రభుత్వానికి బీజేపీ సవాళ్లు విసురుతుంది. ఈ క్రమంలో కేటీఆర్ ఎక్కువగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. తాజాగా ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘దేశ జనాభాలో కేవలం 2.5 శాతం జనాభా ఉన్న తెలంగాణ… దేశ జీడీపీలో 5 శాతాన్ని అందిస్తోంది. (సోర్స్: ఆర్బీఐ రిపోర్ట్ అక్టోబర్ 2021). ఈ దేశానికి కావాల్సింది డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కాదు. డబుల్ ఫలితాలను ఇచ్చే పాలన’ అని ఆయన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కి సమంత లైక్ కొట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కేటీఆర్ ట్వీట్ ని లైక్ చేయడం అంటే ఆమె కేవలం ఆయన్ని సమర్ధించినట్లు మాత్రమే కాదు, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకించినట్లు కూడా. ఆటోమేటిక్ గా బీజేపీ సానుభూతి పరులు, నాయకుల దృష్టిలో సమంత బీజేపీకి అపోజిషన్ అని ఫిక్స్ అవుతారు. ఇవి అనుకోకుండా కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడతాయి. సక్సెస్ ఫుల్ గా సినిమాలు చేసుకుంటున్న సమంత ఈ పొలిటికల్ బురదలో కాలెందుకు వేశారని కొందరు వాపోతున్నారు. సమంత చేసిన ఈ పని భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలకు కారణమవుతుందో చూడాలి.
ప్రస్తుతం సమంత చేతినిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. యశోద షూటింగ్ చివరి దశకు చేరుకోగా… ఖుషి మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.