KTR Target: తెలంగాణలో రాజకీయ వేడి రగులుకుంటోంది. పార్టీల మధ్య చిచ్చు రేగుతూనే ఉంది. రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోరు జరగనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాత్రం విమర్శల దాడి పెరుగుతూనే ఉంది. ఒకరిపై మరొకరు నోరు పారేసుకుంటున్నారు. మీరేం చేశారంటే మీరు మాత్రం తక్కువ అనే స్థాయిలో విమర్శల వెల్లువ కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఘాటుగా లేఖ రాశారు. మీరు చేస్తున్నదేమిటి? ఏం చేశారు తెలంగాణకు అని ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపు తుక్కుగూడలో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్న నేపథ్యంలో కేటీఆర్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ నేతలు భావిస్తుంటే కేటీఆర్ మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అమిత్ తెలంగాణకు ఎందుకొస్తున్నారు? ఏం చేశారని రాష్ట్రంలో అడుగుపెడుతున్నారు? అంటూ ప్రశ్నలు సంధించారు.
Also Read: Amit Shah: అమిత్ షా టీపీసీసీ అధ్యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనా?
తెలంగాణపై బీజేపీ అడుగడుగునా విషయం చిమ్ముతూనే ఉంది. ఎనిమిదేళ్లుగా రాష్ట్ర అభివృద్ధికి నిధులు మాత్రం ఇవ్వడం లేదు. ఫలితంగా సవతితల్లి ప్రేమ చూపించే బీజేపీకి రాష్ట్రంలో ఏం హక్కు ఉందని పర్యటనలు చేస్తున్నారు? నిధులు ఇవ్వమంటే ఇవ్వరు? అప్పులు తీసుకుంటామంటే కూడా కొర్రీలు పెడుతున్నారు? ఇప్పుడు ఏం సాధించారని వస్తున్నారు? ఎవరి కోసం పాదయాత్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
తెలంగాణ కోసం పనిచేయని పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాబోయే ఎన్నికల్లో అన్ని తేలుతాయి. ఏదో సాధించామని ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతుంటే ఎవరు నమ్మే స్థితిలో లేరని చెబుతున్నారు. ఇంతవరకు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చిన పాపాన పోలేదు. బీజేపీ నేతల్లో చిత్తశుద్ధి కానరావడం లేదు. దీంతోనే వారు ఏదో జనాన్ని నమ్మించాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వంపై ఎందాకా అయినా కొట్లాడతామని, తెలంగాణ విషయంలో మీరు చేస్తున్న ద్రోహానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారని దుయ్యబట్టారు. రాష్ట్రం కోసం నిధులు ఇవ్వకుండా, అప్పులు రాకుండా, విభజన హామీలు అమలు చేయకుండా తప్పించుకు తిరుగుతూ ఇప్పుడు మళ్లీ తెలంగాణలో పర్యటించి ప్రజలను ఎలా మోసం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.