
తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల సందడి నెలకొంది. అన్ని పార్టీల నాయకులు ఆ బిజీలోనే ఉన్నారు. ఆ ఎన్నికలు మిగిసిన తరువాత వెంటనే రాష్ట్రంలో పలుచోట్ల మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ విషయమై ఇప్పటికే అన్ని పార్టీల నాయకులకు సమాచారం అందగా.. అందుకు అవసరమైన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ ఇప్పటినుంచే అవసరమైన చోట వ్యూహాలు రచించేందుకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ముందుగా వరంగల్ పై దృష్టిసారించారు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
త్వరలో వరంగల్ తో పాటు మరికొన్నిచోట్ల పురపోరుకు నగారా మోగనుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓరుగల్లుపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర రాజధాని తరువాత రెండో అతిపెద్ద నగరం వరంగల్ లో ఏప్రిల్ నెలాఖరులో జరగబోయే బల్దియా ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచేందుకు గులాబీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించేందుకు సిద్ధం అయినట్లు కనిపిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చివరకు మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్నా.. ఆశించిన ఫలితాలు మాత్రం అక్కడ రాలేదు. అక్కడ జరిగిన పొరపాట్లు వరంగల్ లో పునరావృతం కాకుండా ఉండేందుకు కేటీఆర్ స్వయంగా ఓరుగల్లు పోరుకు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కన్నా ముందే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఒకవైపు సాగర్ ప్రచారం ముగియకముందే.. ఓరుగల్లులో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి ఏప్రిల్ 12న కేటీఆర్ పర్యటన ఖరారు అయ్యింది. నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నప్పటికీ.. పార్టీ పరంగా ఈ పర్యటన ఎంతో కీలకం కానుంది.
ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో వరంగల్ ఎన్నికల విషయమై కేటీఆర్ చర్చించారు. అందులో గెలుపుగుర్రాల వివరాలు సేకరించారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నవారి చిట్టాకూడా సేకరించారు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. హైదరాబాద్ ఫలితాలు వరంగల్ లో పునరావృతం అవ్వకుండా మెజారిటీస్థానాలు సొంతం చేసుకునేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పావులు కదుపుతున్నారు.