KTR: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో డబ్బులు పంచనని, మద్యం పోయనని అధికారికంగా ప్రకటించిన ఏకైక నేత కల్వకుంట్ల తారకరామారావు. అంతేకాదు. గత ఎన్నికల్లో కూడా తాను ఒక్క రూపాయి కూడా పంచలేదుని, ఎవరికీ మద్యం పోయలేదని తెలిపారు. కేటీఆర్ చెప్పింది నిజమే అయితే ప్రస్తుత రాజకీయం పరిస్థితుల్లో ప్రలోభాలకు గురికాకుండా ఓట్లేసిన సిరిసిల్ల ఓటర్లకు తప్పకుండా సెల్యూట్ చేయాల్సిందే. లక్ష మెజారిటీతో గెలిచిన కేటీఆర్‌ను అభినందించాల్సిందే.
ఎవరూ పంచడం లేదా..?
సిరిసిల్ల నియోజకవర్గం అన్ని పక్షాలు కేటీఆర్ తరహాలోనే రూపాయి ఖర్చు పెట్టకుండానే ఎన్నికల్లో పోటీచేస్తున్నాయా అంటే.. అలాంటిది జరుగడం లేదు. సిరిసిల్లలో కేటీఆర్ మొదట ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. అప్పుడు ఆయన గెలిచింది. కేవలం 1,100 ఓట్ల మెజారిటీతోనే. అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ కేసిన కేకే.మహేందర్‌రెడ్డి కేటీఆర్‌కు గట్టి పోటీ ఇచ్చారు. తెలంగాణ వాదం బలంగా ఉన్న నేపథ్యంలో సిరిసిల్ల ఓటర్లు కేటీఆర్‌కు స్వల్ప మెజారిటీతో గెలిపించారు. ఈ సమయంలో టీఆర్‌ఎస్ భారీగా డబ్బులు ఖర్చు చేసింది. కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ కూడా అంతకు మించి డబ్బులు పంచింది. తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న కేటీఆర్ నియోజకవర్గాన్ని ఊహకందని రీతిలో అభివృద్ధి చేశారు. దీంతో సిరిసిల్ల రూపురేఖలు మారిపోయాయి. దీంతో ఓటర్లు కృతజ్ఞతగానే కేటీఆర్‌ను గెలిపిస్తున్నారు. ఇదే సమయంలో కేటీఆర్‌ను ఓడించేందుకు విపక్ష కాంగ్రెస్, బీజేపీతోపాటు ఇతర పార్టీలు పంచే డబ్బులు తీసుకుంటున్నారు. కానీ ఓటు మాత్రం డబ్బులు, మద్యం పంచని కేటీఆర్‌కే ఓటు వేస్తున్నారు.
అభివృద్ధినే కోరుకుని..
విపక్షాలు తాయిలా ఇస్తున్నా.. ప్రలోభపెడుతున్నా.. సిరిసిల్లలో మెజారిటీ ఓటర్లు నియోజకవర్గ అభివృద్ధినే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే విపక్షాలను కాదనడం లేదు. అదే సమయంలో కేటీఆర్ ఓడిపోతే అభివృద్ధి ఆగిపోతుందేమో అన్న ఆలోచనలో సిరిసిల్ల ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌కే ఏటా మెజారిటీ పెంచుతున్నారు.
డబ్బులు తీసుకుంటున్న నేతలు..
అయితే.. సిరిసిల్లకు చెందిన అధికార పార్టీ నేతలు మాత్రం తమ నాయకుడు కేటీఆర్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రజలకు పంచాలని, ప్రచార సామగ్రి కొనాలనే నెపంలో భారీగా నగదు కేటీఆర్ నుంచి తీసుకుని జేబులో వేసుకుంటున్నారు. కొందరు ఎన్నికల తర్వాత కాంట్రాక్టులు, ఇసుక, మొరం దందాలు చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే ఇక్కడ అభినందించాల్సింది సిరిసిల్ల ఓటర్లు, అభ్యర్థి కేటీఆర్‌నే!