
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పై, పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి అవసరమైన చర్యల పై, ఇతర పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై హైదరాబాద్ లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఖమ్మం నగరాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్.. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్, కమిషనర్లకు సూచించారు. తీసుకోవాలన్నారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఖమ్మం పట్టణంలో పేదలకు వసతి సౌకర్యాలను కల్పించాలని సూచించారు.
పలు పట్టణాలతో పాటు ఖమ్మం నగరంలో కూడా మౌలిక వసతుల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రజావసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. పురపాలకశాఖ నుంచి అవసరమైన నిధులను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనుల్లో అలసత్వం వహించే కాంట్రాక్టర్ల నుంచి ఆ పనులను తొలగించి ఇతరులకు బాధ్యతలు అప్పజెప్పాలని అధికారులను ఆదేశించారు. ప్రజా రవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని అన్నారు. తాగునీటి కొరత లేకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించకుండా నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నగరాలతో పాటు, పట్టణాల్లో పలు గ్రామాలు విలీనమయ్యాయని, వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించి ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, గ్రీనరీకీ అవసరమైన తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. తానే స్వయంగా ఈ నెల మూడో వారంలో ఖమ్మం నగరంలో పర్యటించి జరుగుతున్న అభివృద్ధ్దిని పరిశీలిస్తానన్నారు.