https://oktelugu.com/

KTR : సొంత టీం రెడీ చేసుకుంటున్న కేటీఆర్..

భారత రాష్ట్ర సమితికి ఉన్న ఎమ్మెల్యేల్లో కొంతమంది పార్టీ ప్రారంభం నాటి నుంచి ఉన్నవారే.. అయితే వీరిలో కొంతమంది సొంత పార్టీ నాయకులు నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుండడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Written By: , Updated On : July 19, 2023 / 09:14 PM IST
Follow us on

KTR : ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతకంతకు ఉత్సాహం పెరుగుతుండగా.. అధికార భారత రాష్ట్ర సమితిలో మాత్రం అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మొన్నటిదాకా పార్టీకి వీర విధేయులుగా ఉన్నవారు ఒక్కసారిగా సొంత కార్యకర్తల నుంచే నిరసన ఎదుర్కొంటున్నారు. మొన్నటిదాకా ఇటువంటి పరిస్థితి భారత రాష్ట్ర సమితిలో లేదు. కానీ ఇటీవల కాలం నుంచి ఇది తీవ్ర రూపం దాల్చింది. వాస్తవానికి పార్టీలో ఇటువంటి పెడపోకడలను సహించని పెద్దలు.. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ మౌనంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారనేది అంతు పట్టకుండా ఉంది.

పొమ్మన లేక పొగ పెడుతున్నారా?

భారత రాష్ట్ర సమితికి ఉన్న ఎమ్మెల్యేల్లో కొంతమంది పార్టీ ప్రారంభం నాటి నుంచి ఉన్నవారే.. అయితే వీరిలో కొంతమంది సొంత పార్టీ నాయకులు నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుండడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కేసిఆర్ కు నమ్మిన బంటు లాగా ఉంటుంది. ఇటీవల కాలం నుంచి ఆమెకు వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఆమె నాయకత్వాన్ని నిరసిస్తూ ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి నాయకులు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన జాన్సన్ నాయక్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రేఖా నాయక్ కు టికెట్ ఇవ్వద్దని, ఆమెకు టికెట్ ఇస్తే తాము పనిచేయలేమని కొంతమంది కార్యకర్తలు నేరుగా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై సొంత పార్టీ నాయకులు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ఆయనకు బదులుగా మరెవరికైనా టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన పనితీరు నచ్చని కొంతమంది పార్టీ నాయకులు నేరుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ రావు ను కలిశారు. వారు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు. ఇక రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై కూడా భారత రాష్ట్ర సమితి నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వద్దని నేరుగా అధిష్టానానికే ఫిర్యాదు చేశారు.. వీరిలో కొంతమంది నాయకులు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. అయితే సొంత పార్టీ నాయకులు ఎక్కడో ఒకచోట నిరసన వ్యక్తం చేస్తే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో పొమ్మనలేక పొగ పెడుతున్నారనే సామెత వినిపిస్తోంది.

ప్రాబల్యం పెంచుకుంటున్నారా

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నాటి నుంచి భారత రాష్ట్ర సమితిపై కేటీఆర్ తిరుగులేని పెత్తనం సాధించారు. ఆయన ఆధిపత్యం పెరిగిపోవడంతో సీనియర్ నాయకులు దాదాపు సైలెంట్ అయిపోయారు. కెసిఆర్ కూడా పార్టీ పగ్గాలు కేటీఆర్ కు అప్పగించిన నేపథ్యంలో మిగతావారు మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఇదే క్రమంలో పార్టీపై తన పట్టు పెంచుకున్న కేటీఆర్.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేల టికెట్ల విషయంలోనూ తన వారికే పట్టం కట్టే ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేఖ నాయక్ కు బదులుగా జాన్సన్ నాయక్ కు ఈసారి టికెట్ ఇస్తుండడం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు సొంత కార్యకర్తల నుంచి నిరసన ఎదుర్కొంటుండడం, అది కూడా ఎన్నికల ముందు జరుగుతుండడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీలో అసమ్మతిని సాకుగా చూపించి కేటీఆర్ తన సొంత మనుషులకు టికెట్లు ఇచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేమని వారు చెబుతున్నారు. ఉదాహరణకు కంటోన్మెంట్ ప్రాంతంలో అక్కడి ఎమ్మెల్యే సాయన్న ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆ నియోజకవర్గంపై మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కన్ను వేశారు. ఒకరకంగా కేసీఆర్ నుంచి ఆయనకు ఆశీస్సులు ఉండడంతోనే.. రాజశేఖర్ రెడ్డి రంగంలోకి దిగారు. అక్కడ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కేటీఆర్ కు సన్నిహితుడైన తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ కంటోన్మెంట్ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేఫ్ పాలిటిక్స్ పేరుతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షాత్తు ఆశీస్సులు ఉన్నప్పటికీ.. మంత్రి మల్లారెడ్డి అల్లుడైనప్పటికీ.. తనకు అనుకూలమైన వ్యక్తిని కేటీఆర్ కంటోన్మెంట్ ప్రాంతంలో రంగంలోకి దించాడంటే.. మిగతా ప్రాంతాలను అంత సులభంగా ఎలా వదిలిపెడతాడనే వాదనలు వినిపిస్తున్నాయి. స్థూలంగా చెప్పాలంటే పార్టీపై పెత్తనం చెలాయిస్తున్న కేటీఆర్.. వచ్చే ఎన్నికల్లోనూ తన మనుషులకు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.