KTR: నవంబర్ 15న వరంగల్ లో నిర్వహించే విజయగర్జన సభను విజయవంతం చేసే పనిలో మంత్రి కేటీఆర్ తలమునకలయ్యారు. సభకు ఇన్ చార్జిగా కేటీఆర్ తన శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తున్నారు. సభను దిగ్విజయం చేసే పనిలో భాగంగా నేతలను సమాయత్తం చేస్తున్నారు. ప్రతి రోజు ఇరవై నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశమై సభ నిర్వహణపై మార్గ నిర్దేశం చేస్తున్నారు. జనసమీకరణలో నిర్లక్ష్యం తగదంటూ చెబుతున్నారు. సభ కోసం ప్రతి ఊరి నుంచి వేలాదిగా జనం తరలి రావాలని పిలుపునిస్తున్నారు.

జనసమీకరణలో నేతలు వెనక్కి తగ్గకూడదని సూచిస్తున్నారు. బహిరంగసభ విజయవంతం కోసం అందరు శ్రమించాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు చెబుతున్నారు. గ్రామ, మండల, జిల్లా నేతలు అప్రమత్తంగా ఉంటూ జన సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను గుర్తించాల్సిందే. 22 వేల బస్సులతో జన సమీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయగర్జన సభను విజయవంతం చేసే పనిలో నేతలందరు నిమగ్నమయ్యారు.
నవంబర్ 2న హుజురాబాద్ ఫలితం ఉండడంతో ఒకవేళ ప్లస్ అయితే ఏం లేదు కానీ మైనస్ అయితే నేతలెవరు రావడానికి ముందుకు వస్తారో లేదో అనే అనుమానాలు వస్తున్నాయి. ప్లీనరీ మాత్రం ఫలితాలకంటే ముందే ఉండగా విజయగర్జన సభ మాత్రం ఎన్నికల ఫలితం తరువాత ఉండటంతో నేతలు సభను విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
విజయగర్జన సభ నిర్వహణపై నేతల్లో సమన్వయం ఉండాలని చెబుతున్నారు. జనసమీకరణతో సభ దద్దరిల్లేలా చూడాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు నేతలు తమ శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేటీఆర్ నేతలకు టాస్క్ ఇస్తూ విజయగర్జన విజయవంతం అయ్యేలా చూడాలని దిశా నిర్దేశం చేస్తున్నారు.