KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక అన్ని పార్టీలు లోక్‌సభ ఎన్నికలపై దృష్టిపెట్టాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే కమిటీలను ఏర్పాట్లు చేసి ఇన్‌చార్జీలను నియమించాయి. తమది జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ తీవ్రమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. దాని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగతా అన్ని పార్టీల్లో పార్టీ ఓడిపోయింది. దీంతో ప్రతిపక్షానికే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక, లోక్‌సభ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కసరత్తు చేస్తున్నారు.
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు..
లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న నేతలను, క్యాడర్‌ను లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చిన్న బ్రేక్ మాత్రమే అని, భవిష్యత్ మనదే అని ధైర్యం చెబుతున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షలు పూర్తయ్యాయి.
లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. అందుకు బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు రెడీ అవుతోంది.
ఈ క్రమంలో ఈసారి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కూడా లోక్‌సభ బరిలో నిలపాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై కేటీఆర్‌ను సంప్రదించగా.. ఆయన సమాధానం దాటవేశారని తెలుస్తోంది.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని..
తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాము పోటీ చేయడం ద్వారా ఇతర అభ్యర్థులకు గెలుపుపై విశ్వాసం పెరగడమే కాకుండా, ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందని బీఆర్‌ఎస్ లెక్కలు వేస్తోంది. అదే సమయంలో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి తమ మద్దతు అవసరం అయితే కీలకంగా మారతామని భావిస్తోంది. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ను కీలకంగా మార్చే అవకాశం ఉంటుందని గులాబీ నేతలు భావిస్తున్నారు.
అక్కడి నుంచే పోటీ…
బలమైన అభ్యర్థులను నిలపడమే లక్ష్యంగా కేటీఆర్‌ను కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న బీఆర్‌ఎస్.. ఆయనను మల్కాజ్‌గిరి లేదా సికింద్రాబాద్ సీటు నుంచి పోటీ చేయించాలని చూస్తున్నట్లు సమాచారం. మల్కాజిగిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. సికింద్రాబాద్ పరిధిలోని ఆరు స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఓ చోటు నుంచి ఆయన్ను బరిలోకి దింపాలని గులాబీ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ బాధ్యతలను హరీశ్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.