Bandi Sanjay- KTR: తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. సామాజిక మాధ్యమాలే వేదికగా వరుసగా ట్వీట్లు చేసుకుంటున్నారు. ఒకరు జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరొకరు తెలంగాణ మంత్రి కేటీఆర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సోషల్ మీడియా వేదికగా ఇద్దరు పోటీపడి తిట్ల దండకం మొదలు పెట్టారు. రాజకీయంగా నిలదొక్కుకునే క్రమంలో మునుగోడు ఉప ఎన్నికపై రెండు పార్టీలు సమరోత్సాహంతో ఉన్నాయి. దీంతో ఇద్దరి మధ్య మాటల ఘాటు పెరుగుతోంది.

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి జాతీయ రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నా అది అంత సాధ్యం కాదని చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీతో కయ్యానికే ప్రాధాన్యం ఇస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత టీఆర్ఎస్ పార్టీ బీజేపీని టార్గెట్ చేసుకుంటోంది. రైతు ఉద్యమాలను సాకుగా చూపి బీజేపీ ప్రతిష్టను దిగజార్చాలని చూసింది. ధాన్యం కొనుగోలును సాకుగా చూపి బీజేపీని అపహాస్యం చేయాలని భావించినా కుదరలేదు. దీంతో రోజురోజుకు బీజేపీ ప్రతిష్ట మరింతగా పెరిగిపోతోంది. దీంతో జీర్ణించుకోలేని టీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగుతోంది.
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే మూడు దఫాలుగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి టీఆర్ఎస్ విధానాలను ఎండగట్టారు. ఫలితంగా ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత పెంచుతున్నారనే ఉద్దేశంతో బీజేపీపై ఒంటికాలుతో లేస్తోంది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని సీఎం కేసీఆర్ చూస్తున్నా అది అంత సులభం కాదని చెబుతున్నారు. దీంతోనే రెండు పార్టీల్లో వైరం పెరుగుతోంది. ట్వీట్ల ద్వారా ఇద్దరు సెటైర్లు వేసుకుంటారు.
బండి సంజయ్ లవంగం అని కేటీఆర్ ట్వీట్ చేయడంతో దీనికి బదులుగా లంగలు, లఫంగాలు అంటూ సంజయ్ ప్రతిగా పోస్టు పెట్టడంతో ఇద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. మీలాంటి వారి చేత సమాజానికి ప్రమాదముందని సంజయ్ కౌంటర్ ఇవ్వడంతో ఇద్దరి మధ్య మాటల వేడి జోరుగా సాగుతోంది. ఇంటికి కాపలా కాస్తామని చెప్పి యజమానినే కరిచే కాపలా కుక్కలు అని సంజయ్ పేర్కొనడంతో కేటీఆర్ కు గట్టి జవాబు ఇచ్చినట్లు అయింది. దీంతో ట్విట్టర్ ద్వారా రెండు పార్టీల్లో విభేదాల మంటలు చెలరేగుతున్నాయి.

రెండు పార్టీల మధ్య విభేదాలు ఇప్పటివి కావు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించడంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అవుతోందనే అనుమానం వచ్చింది. దీంతోనే అప్పటి నుంచి బీజేపీని తమ శత్రువుగా భావిస్తూ వస్తోంది. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి పాలైతే ఇక ప్రతిష్ట మసకబారినట్లే అని తెలుసుకున్న టీఆర్ఎస్ ఇక ఉపేక్షించేది లేదని బీజేపీని అధికారంలోకి రాకుండా చేయాలనే ఆలోచనతోనే బీజేపీపై విమర్శలు చేస్తోంది. దీంతో ఇద్దరి మధ్య మాటల తీవ్రత పెరుగుతోంది.
రాబోయే ఎన్నికల్లో బీజేపీని బంగాళాఖాతంలో కలిపేయాలని కేసీఆర్ చేస్తున్న నినాదాలకు అంతగా ప్రాధాన్యం రావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ మూడో కూటమి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. కానీ ఉత్తరాది వారు దక్షిణాది వారిని నమ్మరనే విషయం ఆయనకే తెలియకపోవడం గమనార్హమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కూడా చంద్రబాబు ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ కేసీఆర్ మాత్రం తాను సాధిస్తానని చెబుతూ ముందుకు పోతుంటే అందరిలో ఆశ్చర్యమే కలుగుతోంది. ఈ రాజకీయ వేడిలో రెండు పార్టీల మధ్య విభేదాలు ఇంకా ఎక్కడికి వెళతాయో అర్థం కావడం లేదు.