Krishnam Raju’s wife: రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనన్నారా? రాజకీయ రంగ ప్రవేశం ప్రకటన చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. సొంత నియోజకవర్గ నరసాపురం నుంచి ఆమె పోటీ చేస్తారని తెలుస్తోంది. కృష్ణంరాజు జయంతి పేరుతో మొగల్తూరులో భారీ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాజకీయ ప్రకటన చేస్తానని ఆమె స్వయంగా చెప్పడం విశేషం.
కృష్ణంరాజు బిజెపిలో సుదీర్ఘకాలం పనిచేశారు. నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆయన చనిపోయిన నాటి వరకు బిజెపిలోనే కొనసాగారు. ఒకానొక దశలో జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ ను పలు సందర్భాల్లో అభినందించారు కూడా. అయితే ఆయన అకాల మరణంతో భార్య శ్యామలాదేవి ఎంపీగా పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమె రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఈసారి కృష్ణంరాజు జయంతి వేడుకలను భారీగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తన రాజకీయ ప్రవేశం పై వస్తున్న ఊహాగానాలపై శ్యామలాదేవి స్పందించారు. 20వ తేదీన జయంతి కార్యక్రమం పూర్తయిన తర్వాత రాజకీయ అంశాలపై ప్రస్తావిస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఆమె వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ హై కమాండ్ ఆమెను సంప్రదించిందని.. సానుకూలంగా స్పందించడంతో నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజు వైసీపీ నాయకత్వంతో విభేదిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే బలమైన అభ్యర్థిని దించడం ద్వారా రఘురామకృష్ణంరాజుకు చెక్ చెప్పాలని జగన్ భావిస్తున్నారు. అందుకే కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిని ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే శ్యామలాదేవి ఆసక్తి వెనుక కుటుంబ సభ్యుల మద్దతు ఉందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
గోదావరి జిల్లాల్లో కాపులతో పాటు క్షత్రియ సామాజిక వర్గం కూడా ఎక్కువే. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిని బరిలో దించడం ద్వారా క్షత్రియ సామాజిక వర్గ ఓట్లకు గాలం వేయవచ్చని జగన్ భావిస్తున్నారు. అటు ప్రభాస్ అభిమానులను సైతం ఆకర్షించవచ్చని అంచనా వేస్తున్నారు. తద్వారా పవన్ ను దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. శ్యామలాదేవి గానీ పోటీ చేస్తే ఉభయగోదావరి జిల్లాల్లో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారే అవకాశం ఉంది. అయితే ఇంతకీ శ్యామలాదేవి ఏ ప్రకటన చేస్తారోనన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. రెండు రోజుల్లో దీనికి తెరపడనుంది.