Komatireddy Venkat Reddy Meets Modi: ప్రధాని అపాయింట్ మెంట్ దొరకడం అంటే అంత ఆషామాజీ కాదు. గతంలో కేసీఆర్‌కే అపాయింట్ మెంట్ దొరకలేదని ఢిల్లీ వెళ్లి తిరిగి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కేవలం అరగంటలోనే ప్రధాని అపాయింట్ మెంట్ దొరకడం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. సోమవారం సాయంత్రం కోమటిరెడ్డి పీఎంవో ఆఫీసులో నరేంద్రమోడీని కలిశారు.
కాంగ్రెస్ ఎంపీగా ఉన్న ఆయన.. చాలా కాలంగా పార్టీలో అసంతృప్తిగానే ఉంటున్నారు. రేవంత్ కు టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంతో ఆయన గుర్రుగా ఉంటున్న విషయం తెలిసిందే. గతంలో కేంద్ర మంత్రులను కూడా కలిసి ఇలాగే కలకలం సృష్టించారు. ఇప్పుడు ప్రధాని మోడీని కలవడం మరోసారి కాంగ్రెస్ లో మంటలు రేపుతున్నాయనే చెప్పుకోవాలి.
Also Read: పవన్ టార్గెట్ ఫిక్స్.. ఇక తేల్చుకోవాల్సింది చంద్రబాబే..!
కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో గెలిచిన జోష్ లో ఉన్న ప్రధాని మోడీ.. తెలంగాణపై కూడా ఫోకస్ పెట్టినట్టు ఈ భేటీతో తెలిసిపోయింది. అయితే తాను మాత్రం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు ప్రధానితో భేటీ అయ్యానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. అందుకు ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి వివరించారు.
మూసీ నది ప్రక్షాళన, హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే విస్తరణ గురించి చర్చించానన్నారు. అయితే తనను తెలంగాణ రాజకీయాల గురించి ప్రధాని అడిగినట్టు కోమటిరెడ్డి తెలిపారు. దీంతో ఇది అభివృద్ధి పనుల చర్చ అని చెబుతున్నా కూడా.. రాజకీయ కోణంలోనే ఉన్నట్టు అర్థం అవుతోంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రధాని మరిన్ని ప్రకంపనలు రేపే ఛాన్స్ లేకపోలేదు. మరి ఆ ప్రకంపనలు కోమటిరెడ్డి బ్రదర్స్ తో షురూ అవుతాయా లేదా అన్నది చూడాలి.
Also Read: పవన్ కళ్యాణ్ పై పడ్డ వైసీపీ నేతలు.. సమస్యలు వదిలేసి వ్యక్తిగత దాడి?