Komatireddy Venkat Reddy: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఎన్నెన్నో రికార్డులు నమోదయ్యాయి. చాలామంది నేతల తలరాతలు మారిపోయాయి. మూడు దశాబ్దాల తర్వాత కెసిఆర్ కు దారుణ ఓటమి ఎదురైంది. ఓ సాధారణ అభ్యర్థిపై కెసిఆర్ ఓడిపోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ పేరిట నమోదైన రికార్డును కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిగమించారు. నాడు ఆయన సాధించిన మెజారిటీని తిరగ రాశారు.
టిడిపి ఆవిర్భావం తర్వాత.. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానానికి ఎన్టీఆర్ పోటీ చేశారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి మందడి రామచంద్రారెడ్డి పై గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్కు 49,788 ఓట్లు రాగా.. మందడి రామచంద్రారెడ్డికి 18202 ఓట్లు వచ్చాయి. 31, 587 ఓట్లు మెజారిటీతో ఎన్టీఆర్ విజయం సాధించారు.ఇంతవరకు నల్గొండ నియోజకవర్గానికి ఇదే అత్యధిక మెజారిటీ. ఇప్పుడు ఆ రికార్డును కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెరిపేశారు. 54, 332 ఓట్లతో విజయం సాధించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 1,07,405 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి 53,073ఓట్లు మాత్రమే పొందగలిగారు.
2004లో టిడిపి అభ్యర్థి కొత్త సుఖేందర్ రెడ్డి పై కోమటిరెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో 22,738 మెజారిటీ సొంతం చేసుకున్నారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెకిలం శ్రీనివాసరావు పై సిపిఎం అభ్యర్థి నంద్యాల నరసింహారెడ్డి 29,163 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై కంచర్ల భూపాల్ రెడ్డి 23,698 ఓట్లు మెజారిటీ సాధించారు.