ఫైర్ బ్రాండ్‌కు కేరాఫ్ అడ్రస్ ఆర్కే రోజా. విపక్షాలను నిలదీయాలన్నా.. విపక్ష లీడర్లను టార్గెట్ చేసి మాట్లాడాలన్నా ఆమె తరువాతే ఎవరైనా. ఏ మాత్రం జంకు లేకుండా తన మాటలతో ఉతికి ఆరేస్తుంటారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసి మాట్లాడేవారు. ఆ తర్వాత జగన్ నేతృత్వంలో వైసీపీ చేరిన ఆమె.. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలను విమర్శిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబును తన మాటలతో నిలదీస్తూనే ఉంటారు. ఆయన కొడుకు లోకేష్‌ను కూడా చాలా సందర్భాల్లో ఎద్దేవ చేసిన రోజులు కూడా ఉన్నాయి.
అంతటి ఫైర్ బ్రాండ్ అయిన రోజా ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అనూహ్యంగా ఆమెపై ఓ సంచలన వీడియో మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎప్పుడూ చంద్రబాబు తిట్టిపోసే రోజా.. ఊహకందని స్థాయిలో మెచ్చుకుంటూ.. పొగడ్తల వర్షం కురిపించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది కాస్త ఇప్పుడు వైసీపీ వర్గాల్లో సంచలనం అయింది. గతంలో ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చేసిన కామెంట్లు అవి. చంద్రబాబు పుట్టిన రోజును పురస్కరించుకొని ఆమె మాట్లాడారు. ఇందులో ఆమె చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు.
‘తెలుగుతల్లి అన్నపూర్ణ వరాలపట్టి.. అమ్మణ్ణమ్మ కలల పంట.. నందమూరి సింహ రాజకీయ వారసుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు, తెలుగు సింహం, అపర రాజకీయ మేధాదురంధురుడు, పేదల పాలిట పెన్నిధి, తెలుగువారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన కీర్తి వెలుగుల చంద్రుడు.. జగమంతా మెచ్చిన ఆంధ్రుడు. తెలుగు సామ్రాజ్య వీర.. ధీర.. శూర రాజకీయ చక్రవర్తి.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు’ అంటూ రోజా కీర్తించారు.
అయితే.. ఇప్పుడు ఎవరో గుర్తుతెలియని వారు ఆ వీడియోను వైరల్ చేసేశారు. ఇటీవల చంద్రబాబు తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఆ సందర్భంలో ఈ వీడియో వైరల్ అయింది. రోజా టీడీపీని వదిలి సుమారు పదేళ్లు అవుతోంది. టీడీపీని వదిలినప్పటి నుంచి ఆమె వైసీపీలోనే కొనసాగుతున్నారు. పైగా సందర్భానుసారం జగన్‌ను పొగుడుతుంటారు. చంద్రబాబును మాత్రం టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఇటీవల ఆమె శస్త్రచికిత్స చేసుకున్న సందర్భంలోనూ ఆస్పత్రి నుంచి వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలోనూ చంద్రబాబును తీవ్రస్థాయిలో విమర్శించారు. వైసీపీని గెలిపించాలని కోరారు.
అయితే.. ఇప్పుడు ఈ వీడియో సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే రోజాకు ఆమె నియోజకవర్గంలోని పలువురు లీడర్లతో పొసగడం లేదు. దీంతో కొందరు కావాలనే.. ఆమెను బ్లేమ్ చేయడానికే ఈ వీడియోను వైరల్ చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారంటూ రోజా వర్గం అంటోంది. కేజే కుమార్ వర్గం రోజాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఆయన వర్గం ప్రస్తుతం ఓ మంత్రి నేతృత్వంలో పనిచేస్తోంది. ఈ వర్గమే రోజా ఈమేజీని డ్యామేజీ చేసేందుకు పూనుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.