
ఒక రాష్ట్రం బాగుంది అని చెప్పాలంటే.. ప్రధానంగా రెండు విషయాలను చూస్తే సరిపోతుంది. ఒకటి సంక్షేమం, రెండు అభివృద్ధి. అయితే.. అభివృద్ధి కన్నా సంక్షేమ ఫలం త్వరగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఓ పథకం ప్రవేశపెట్టడం.. ఓ తేదీ నిర్ణయించి, అప్పట్నుంచి అమలు చేస్తే సరిపోతుంది. ప్రజలకు నేరుగా చేరిపోతుంది. కానీ.. అభివృద్ధి అలా కాదు. దానికి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి. అంతేకాదు.. ప్రభుత్వం ఒక్కటే అనుకుంటే జరిగేది కాదు. ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఎంతో కీలకం. ఈ ఒప్పందాలు కుదిరి, పరిశ్రమలు, ఇతర సంస్థలు రావాలి. వాటిని నెలకొల్పాలి. ఆ తర్వాత వృద్ధి చూడాలి. ఇలా చాలా తతంగం ఉంటుంది. అందువల్ల.. జనం దృష్టిని అభివృద్ధి త్వరగా ఆకర్షించలేదు. అందుకే.. ప్రభుత్వాలు సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తాయి. ఓట్లు కురిపించే ప్రధాన అస్త్రం అదే కావడంతో.. మెజారిటీ ప్రభుత్వాలు దాన్నే ఎంచుకుంటాయి.
అయితే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తాను సంక్షేమంలోనే కాకుండా.. అభివృద్ధిలోనూ ముందు ఉన్నానంటూ నిరూపించింది. ఇందుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రానికి కిటెక్స్ అనే సంస్థ వచ్చేసింది. వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. అయితే.. ఇది అంత ఈజీగా వచ్చిందేమీ కాదు. దేశవ్యాప్తంగా దాదాపు పది పన్నెండు రాష్ట్రాలు ఈ కంపెనీ కోసం పోటీ పడ్డాయి. తమ రాష్ట్రంలోనే పరిశ్రమ పెట్టాలని కోరాయి. కానీ.. చివరకు వారు తెలంగాణ వైపు మొగ్గుచూపారు. ఇందులో కేటీఆర్ సమయస్ఫూర్తి వాటా పెద్దదని చెబితే ఆశ్చర్యం కలగక మానదు. ఆయన సమయానుగుణంగా స్పందించడం వల్లనే కిటెక్స్ కంపెనీ రాష్ట్రానికి వచ్చింది.
అసలు విషయం ఏమంటే.. కిటెక్స్ గ్రూప్ కేరళ రాష్ట్రంలో 50 సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు ఆ కంపెనీని మరింతగా విస్తరించేందుకు సిద్ధమైంది. అయితే.. అక్కడ ప్రభుత్వానికి, కంపెనీకి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో.. ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన రాష్ట్రాలు సుమారు పది వరకు.. ఆ కంపెనీ ఎండీ జాకబ్ ను కలిసి, తమ రాష్ట్రానికే రావాలంటూ కోరడం మొదలు పెట్టాయి. అయితే.. వీళ్లకన్నా ముందే వారితో మంత్రి కేటీఆర్ టచ్ లోకి వెళ్లారు. పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ మొదట జాకబ్ తో మాట్లాడితే.. పెద్దగా స్పందించలేదని సమాచారం.
ఆ తర్వాత కేటీఆర్ రంగంలోకి దిగారు. అయినప్పటికీ.. వారు సానుకూలంగా స్పందించలేదు. దీంతో.. కేటీఆర్ మరో యాంగిల్ లో వచ్చారు. ఒకసారి మా రాష్ట్రానికి రండి.. పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ముందే చెప్పాల్సిన పనిలేదు. వచ్చి, ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాతే నిర్ణయం చెప్పండి అని కేటీఆర్ జాకబ్ ను ఆహ్వానించారు. అయినప్పటికీ.. వారు ఇంకా నాన్చుడు పద్ధతిలోనే ఉన్నారు. అప్పుడు.. పెట్టుబడుల విషయం తర్వాత మాట్లాడుకుందామని, కేవలం రాష్ట్రాన్ని సందర్శించడానికి రావాలని చెప్పగా.. వారు వీలు చూసుకొని వస్తామని చెప్పారు. దీనికి.. టైమ్ చెబితే.. విమానం పంపిస్తామని అన్నారట కేటీఆర్. విమానం పంపించడమేంటని ఆశ్చర్యపోయిన జాకబ్ టీమ్.. వస్తామని చెప్పి, శుక్రవారం హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది.
ఆ తర్వాత టీఎస్ ఐపాస్ విధానాన్ని కేటీఆర్ వివరించి, ఇక్కడ ఉన్న సౌకర్యాలను, నీళ్లు, విద్యుత్ వసతి అన్నిటి గురించీ వివరించారు. ఇరు వర్గాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తయిన తర్వాత.. జాకబ్ టీమ్ బయలుదేరేందుకు సిద్ధమైంది. నిర్ణయం తర్వాత చెబుతామని వెళ్లేందుకు రెడీ కాగా.. వరంగల్ టెక్స్ టైల్స్ పార్కును చూసి వెళ్లాలని కేటీఆర్ కోరారు. సమయం లేదని, మళ్లీ వస్తామని చెప్పగా.. వెంటనే హెలీకాఫ్టర్ అరేంజ్ చేస్తామని చెప్పారు మంత్రి. దీంతో.. రెండోసారి ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఛాపర్ ఎక్కేసి వరంగల్ ను చుట్టేసివచ్చారు. ప్రభుత్వం ఎంతగా బిజినెస్ ఫ్రెండ్లీనో అనే విషయం వారికి అర్థమైంది, వరంగల్ నుంచి హైదరాబాద్ రాగానే.. వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు జాకబ్ ప్రకటించారు. ఇదంతా.. కేటీఆర్ సమయస్ఫూర్తి ఫలితమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.