Kishan Reddy: హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా చివరకు బీజేపీయే విజయం సాధించింది. దీంతో టీఆర్ఎస్ లో గుబులు మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలుసుకుని బీజేపీపై లేనిపోని రాద్దాంతం చేస్తూ అభాసుపాలవుతోంది. ప్రజల్లో చులకన అయిపోతోంది. ఫలితంగా కేసీఆర్ బీజేపీ మీద కోపం తెచ్చుకుంటూ ఆయనలోని తప్పులను కప్పి పుచ్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అనవసర పట్టింపులకు పోతూ విమర్శలు మూటగట్టుకుంటోంది.
టీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేకపోవడంతో బీజేపీపై ఆరోపణలు చేస్తోంది. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ వరిధాన్యం కొనుగోళ్లలో ఉన్న ఇబ్బందుల్ని తెలుసుకునేందుకు వెళితే ఆయనపై దాడికి ప్రయత్నించడం వారి అనైతికతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ రోజురోజుకు తనలోని చేతగాని తనాన్ని బయటపెట్టుకుంటోంది. కొత్త నాటకాలు ఆడుతూ ప్రజలను తప్పు దారి పట్టించేందుకు ప్రయత్నిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతి గింజ కొంటామని చెబుతున్నా ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా రాష్ర్టంలో పరిస్తితి మారిపోతోంది. కేంద్రం మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ బద్నాం చేయాలని చూస్తోంది. ఇందుకు గాను యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై ప్రధానితో చర్చిస్తానని చెబుతూ ఢిల్లీలోనే మకాం వేయాలని చూస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
ఏ రాష్ర్టంలో లేని విధంగా ఒక తెలంగాణలో ఎందుకు సమస్య వస్తుందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ నిర్వాకంతోనే ఇదంతా జరుగుతుందని చెబుతున్నారు. కావాలనే కేంద్రంపై విమర్శలకు దిగుతూ ఏదో అప్రదిష్ట మూటగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాష్ర్ట ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు.
ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ రాష్ర్ట కార్యాలయంలో మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ అబద్దాల మీదే మేడలు కడుతున్నారని విమర్శించారు. కేంద్రంపై అభాండాలు వేస్తూ పబ్బం గడుపుకోవాలని తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. సీఎం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.