Rakesh Tikait: టీఆర్ఎస్ పార్టీపై భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి పెద్ద మద్దతుదారు టీఆర్ఎస్ పార్టీయే అని ఆరోపించారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనలు గురువారంతో ఏడాది పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద రైతులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని రైతు సంఘాలు హజరయ్యాయి. ఇందులో పాల్గొనడానికి ఢిల్లీ నుంచి రైతు నాయకుడు రాకేష్ టికాయత్ ప్రత్యేకంగా వచ్చారు. ఇందులో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు..

కేసీఆర్ రైతు వ్యతిరేకి..
తెలంగాణ రైతాంగం కోసం ఎంతో కృషి చేస్తున్నామని చెబుతున్న సీఎం కేసీఆర్ కూడా రైతు వ్యతిరేకి అని రాకేష్ టికాయత్(Rakesh Tikait) సంచలన ఆరోపణలు చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే పోరాటంలో చనిపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం తరుఫున రూ.3 లక్షల చొప్పున అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రాకేష్ టికాయత్ మాట్లాడారు. అమరులైన రైతులకు రూ.3 లక్షలు ఇస్తామన్న సంగతి బాగానే ఉందని, కానీ తెలంగాణలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంగతేంటని ప్రశ్నించారు. దేశంలో రైతులంతా ఒక్కటే అని.. కేవలం భాషలు మాత్రమే వేరని అన్నారు. రైతులు రాజకీయ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులు తమ హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని అన్నారు. బీజేపీకి టీఆర్ఎస్ పార్టీయే అతి పెద్ద మద్దతుదారు అని విమర్శించారు. బీజేపీకి టీఆర్ఎస్ ‘బీ’ టీమ్ లాంటిదని ఆరోపించారు. తెలంగాణలలో పంటలు మార్పిడి చేసుకోవాలని చెబుతున్న ప్రభుత్వం ఆయా పంటలకు సబ్సిడీలు, మద్దతు ధర ఇస్తామని మాత్రం చెప్పడం లేదని మండిపడ్డారు. రైతు ఉద్యమంపై టీఆర్ఎస్ వైఖరి ఏంటో స్పష్టంగా తెలియజేయాలని అన్నారు.
మజ్లిస్‌కు చురకలు..
Also Read: సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై అన్ని అనుమానాలే?
ఇందిరాపార్క్ వద్ద జరిగిన సమావేశంలో రాకేష్ టికాయత్ మజ్లిస్ పార్టీకి కూడా చురకలు అంటించారు. బీజేపీకి మద్దతు ఇచ్చే దున్నపోతును ఇక్కడే బంధించాలని పరోక్షంగా ఓవైసీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. బీజేపీ ఎక్కడ ఓడిపోయే ప్రమాదం ఉంటే అక్కడ మజ్లిస్ పోటీ చేసి ఆ పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. దేశం మొత్తం బీజేపీకి లాభం చేకూర్చేందుకు ఓ దున్నపోతు తిరుగుతుందని దానిని హైదరాబాద్‌లోనే కట్టేయాలని అన్నారు.
బీజేపీని ఆర్ఎస్ఎస్ నడుపుతోంది..
బీజేపీని ఆర్ఎస్ఎస్ నడుపుతోందని టికాయత్ విమర్శించారు. అంబాని, అదానిల ఆదేశాలతోనే అది నడుస్తోందని అన్నారు. బీజేపీకి ఓట్లు వేయొద్దు అన్నందుకే కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసిందని అన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
Also Read: కేసీఆర్ ఢిల్లీ టూర్ పై బీజేపీ ఫుల్ హ్యాపీ