ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తుపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల వెల్లడైన స్థానిక సంస్థల ఫలితాల్లో అధికార వైసీపీ జయకేతనం ఎగురవేసినా.. ఆ పార్టీ సాధించిన విజయాల కంటే ఎక్కువగా టీడీపీ, జనసేన కలవడం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు అధికారికంగా పొత్తు పెట్టుకోలేదు. కానీ, స్థానిక నేతలు, ప్రధానంగా ఉబయ గోదావరి జిల్లాల్లలో ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకొని పోటీ చేశారు. మంచి ఫలితాలు కూడా సాధించారు.

మరోవైపు బీజేపీతో జనసేనకు అధికారికంగా పొత్తు ఉన్నా.. ఈ రెండు పార్టీలు ఎక్కడా కలిసి పనిచేసిన దాఖలాలు కనిపించలేదు. టీడీపీతో అవగాహనతో పోటీ చేసిన స్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించడం జనసేన వర్గాలను ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. బీజేపీతో కలిసి ఉంటే పార్టీకి దక్కే ప్రయోజనం ఏమీ లేకపోగా.. నష్టం జరుగుతున్నట్లు భావిస్తున్నారు. అదే టీడీపీతో కలిసి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తామన్న అభిప్రాయం స్థానిక సంస్థల ఫలితాల నేపథ్యంలో జనసేన శ్రేణుల్లో బలపడుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. దీంతో ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లలో జనసేన పార్టీ చీల్చిన ఓట్లతో మొత్తం ఫలితాలే మారిపోయాయి. పైగా జనసేన విడిగా పోటీ చేయడంతో ఆ పార్టీ ఎలాగూ గెలవదన్న అభిప్రాయంతో అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీకి ప్రత్యామ్నాయ ఓటర్లు కొందరు వైసీపీకి ఓట్లు వేశారు. కానీ, జనసేన కు లాభిస్తుందనుకుంటే మాత్రం ఆ పార్టీకి ఓటు వేసేవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందన్న అభిప్రాయం ఉంది. అది జరగాలంటే టీడీపీతో జనసేన కలిసి ఉండాలన్న సూచనలు వస్తున్నాయి.
వాస్తవానికి టీడీపీతో స్నేహంగా ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంచి గౌరవం దక్కింది. కానీ, ఆయన రాజకీయంగా అవగాహనలేమి వల్లో, మరో కారణంతోనో టీడీపీకి దూరమయ్యారు. ఆ తరువాత నుంచి ఆయనకు ఎటువంటి గౌరవం దక్కుతుందో అందరూ చూస్తున్నారు. పైగా, ఆయన సినిమాల విడుదల,టికెట్ రేట్ల తగ్గింపు వంటి చర్యలతో ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నాలూ జరిగాయి. తన మిత్రపక్షంగా భావిస్తున్న బీజేపీ దీనిని ప్రశ్నించడంగానీ, ఆయనకు అండదండలు అంధించడం గానీ చేసింది లేదు.
ఈ నేపథ్యంలో జనసేన మళ్లీ టీడీపీతో కలవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోసారి టీడీపీని ఓడించి వైసీపీకి తిరిగి అధికారం కట్టబెట్టాలంటే బీజేపీతో కలిసి ఉండాలని, వైసీపీని ఓడించి రాష్ట్రాన్ని రక్షించుకోవాలనే ఆలోచన ఉంటే మాత్రం ప్రత్యామ్నాయం దిశగా అడుగులేయాలని సూచిస్తున్నారు. మరి జనసేనాని మనసులో ఏముందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.