Prashant Kishor: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. జూన్ 1న 8 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు చివరి దశ పోలింగ్ జరుగనుంది. ఈ స్థానాలకు 904 మందిపోటీ పడుతున్నారు. ఈ దశలో ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్, చండీగఢ్ రాష్ట్రాల్లో పోలింగ్ జరుగనుంది. చివరి విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రచారం గురువారం(మే 30) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో కలిసి భారీ ర్యాలీలు నిర్వహించారు. రాలీలు నిర్వహించిన రోజే.. ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్(పీకే) బిహార్‌లో కాంగ్రెస్ జీరో అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీపై విశ్వసనీయత లేదని తెలిపారు.
కాంగ్రెస్ ఎక్కడా లేదు..
తాను బిహార్‌లో ఉన్నానని, రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేశానని తెలిపారు. కానీ, తనకు రాష్ట్రంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ ఉనికి కనిపించలేదని వ్యాఖ్యానించారు. గడిచిన 17 నెలల్లో ఒక్క గ్రామంలో కూడా తనకు కాంగ్రెస్ జెండా కనిపించలేదన్నారు.
ఆర్జేడీతోపాటు ఐదు పార్టీలతో పొత్తు..
ఇదిలా ఉండగా బిహార్‌తో కాంగ్రెస్‌పార్టీ ఆర్జేడీతోపాటు, మరో ఐదు పార్టీలతో కలిసి పోటీ చేస్తుంది. సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ 9 స్థానాలు, ఆర్జేడీ 23, మిగిలనవి 5 పార్టీలకే కేటాయించారు.
ఆర్జేడీపైనే భారం..
కాంగ్రెస్ కూటమిలో భాగంగా పోటీ చేస్తున్నా.. ఆ పార్టీ అభ్యర్థుల జయాపజయాలు మాత్రం ఆర్జేడీ నేత తేజస్వియాదవ్, జగదానంద్ సింగ్‌పైనే ఆధారపడి ఉంటాయని పీకే తెలిపారు. కాంగ్రెస్‌ను బిహార్ ప్రజలు జాతీయ పార్టీగానే చూడడం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, బీహార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీహార్, ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి గెలుపు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఈసారి మోదీ ప్రధాని కాలేరని పేర్కొన్నారు. బిహార్‌లోని 40 స్థానాలను కూటమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిహార్‌లో నిర్వహించిన మూడు ర్యాలీల్లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన ‘పరమాత్మ’ వ్యాఖ్యలపై కూడా రాహుల్ మండిపడ్డారు.