Kethamreddy Vinod Reddy: పవన్ ఈ రాష్ట్రానికి సీఎం కావాలన్నది సగటు జనసేన అభిమాని లక్ష్యం. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా పట్టి తిరిగే సగటు కార్యకర్త దీనినే కోరుకుంటారు. ఇదే పాయింట్ తోనే పనిచేస్తుంటారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థుల దాడులు, కేసులను అధిగమించి.. అధినేత మాటే శిరోధార్యంగా భావిస్తుంటారు. 2014 నుంచి 2019 వరకు టిడిపి శ్రేణుల చేతుల్లో.. 2019 నుంచి ఎప్పటి వరకు వైసిపి శ్రేణుల చేతుల్లో జనసైనికులు బాధితులుగా మిగిలారనడం అతిశయోక్తి కాదు.అయితే టిడిపి తో జనసేన పొత్తు ప్రకటన తరువాత పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారిలో ఒక రకమైన నైరాశ్యం కనిపిస్తోంది. అటువంటివారు జనసేన నుంచి బయటకు వెళ్లి పోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా నెల్లూరు సిటీ జనసేన ఇన్చార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన దివంగత ఆనం వివేకానంద రెడ్డి అనుచరుడు. యువజన కాంగ్రెస్లో చురుకైన పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడారు. పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎన్డీఏ గెలుపు కోసం పోరాడారు. నెల్లూరు సిటీలో నారాయణ గెలుపు కోసం కృషి చేశారు.2019లో జనసేన తరపున నెల్లూరు సిటీ నియోజకవర్గ నుంచి పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు.
ఇటీవల తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ప్రకటనను పవన్ కళ్యాణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అధినేత నిర్ణయానికి కట్టుబడి పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు. కానీ ఇటీవల వినోద్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. అయినా సరే అధినేత పవన్ ను సీఎం చేయాలన్న సంకల్పంతో పని చేస్తూ వచ్చారు. కానీ నెల్లూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అటు జనసేన కీలక నాయకుల సైతం ఇదే విషయంపై వినోద్ రెడ్డికి సమాచారం అందించినట్లు సమాచారం. మరోవైపు పవన్ కు పవర్ షేరింగ్ విషయంలో స్పష్టమైన ప్రకటన రాకపోవడం సైతం వినోద్ రెడ్డిని మనస్థాపానికి గురిచేసింది. అటు 2014-19 మధ్య మంత్రిగా ఉన్న నారాయణ అవినీతిపై వినోద్ రెడ్డి పోరాడారు. ఇప్పుడు అదే నారాయణ కూటమి అభ్యర్థిగా బరిలో దిగితే మద్దతు తెలపడం అనివార్యంగా మారడంతో వినోద్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేనకు రాజీనామా చేశారు. పవన్ సీఎం చేయాలని ఉన్నా.. ఆ పరిస్థితి కనిపించకపోవడంతో పార్టీలో ఉండడం కంటే.. బయటకు రావడమే శ్రేయస్కరమని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వినోద్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో తన రాజీనామా లేఖను నాయకత్వానికి అందించారు.