Kesineni Nani: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిక్కెట్లు దక్కని వారు పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు.ఇప్పటివరకు వైసీపీ నుంచి టిడిపి, జనసేనలో చేరికలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీలోకి విజయవాడ ఎంపీ కేశినేని నాని వెళతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన టిడిపికి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ టికెట్ నిరాకరించడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని షరతులకు లోబడి ఆయన వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నం సీఎం జగన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం ఆయన వైసీపీలో ఎప్పుడు చేరుతారు అన్నది ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల విజయవాడ టిడిపిలో రాజకీయాలు శరవేగంగా మారాయి. కేశినేని నాని దూకుడుకు చంద్రబాబు కళ్లెం వేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరో నేతకు అవకాశం ఇస్తామని సమాచారం ఇచ్చారు. పార్టీ వద్దన్నాక తాను కొనసాగడం మంచి పద్ధతి కాదని.. అందుకే లోక్ సభ సభ్యత్వంతో పాటు పార్టీకి రాజీనామా చేయనున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. విజయవాడ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా ఉన్న ఆయన కుమార్తె శ్వేత సైతం పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసి విజయవాడ ఎంపీగా గెలిచే దమ్ము తనకు ఉందంటూ నాని ప్రకటించారు. దీంతో ఆయన తటస్థంగా ఉంటారని అంతా భావించారు.
బిజెపి జాతీయ పెద్దలతో సన్నిహితంగా మెలిగే నాని ఆ పార్టీలో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే టిడిపి తో బిజెపి పొత్తు పెట్టుకుంటుందని.. అప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనక తప్పదని నాని భావించారు. అందుకే వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులు నానికి టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. అయితే కొన్ని షరతులు నాని పెట్టినట్లు తెలుస్తోంది. తనతో పాటు వచ్చిన వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే విజయవాడ లోక్ సభ స్థానం వరకు ఓకే కానీ.. ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేలు పెట్టవద్దని వైసిపి హై కమాండ్ సూచించినట్లు సమాచారం.ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని.. కేశినేని నాని వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమని తేలింది.
మరోవైపు ఈరోజు మధ్యాహ్నం సీఎం జగన్ తో కేశినేని నాని భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ నేతలు సీఎం జగన్ కు నాని విషయం చేరవేశారని.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే విజయవాడ ఎంపీ స్థానాన్ని మాత్రమే ఇచ్చేందుకు వైసిపి సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపిలో గత కొంతకాలంగా నాని వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. వైసీపీలోకి వస్తే ఆ పరిస్థితి ఉండకూడదు అని నానికి షరతు విధించినట్లు సమాచారం. మరోవైపు కృష్ణా జిల్లా వైసీపీ నేతలతో కేశినేని నానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారంతా నాని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తానికైతే ఈరోజు సాయంత్రానికి కేశినేని నాని భవితవ్యం తేలనుంది.