Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని రూటు మార్చారు. గత కొద్ది రోజులుగా టిడిపి హై కమాండ్ పై అభ్యంతరకర కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఆయన పార్టీ మారుతారు అన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇప్పుడు సడన్ గా రూట్ మార్చారు. జగన్ సర్కార్ పై విమర్శలు కురిపించారు. దీంతో కేశినేని నాని పై టిడిపిలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
గత ఎన్నికల్లో కేశినేని నాని విజయవాడ ఎంపీగా రెండోసారి విజయం సాధించారు. జగన్ ప్రభంజనంలో సైతం ఎదురొడ్డి నిలబడ్డారు. టిడిపి నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో నాని ఒకరు కావడం విశేషం. అయితే ఇటీవల కేశినేని నాని వ్యవహార శైలి గతానికి భిన్నంగా సాగుతోంది. మునుపటిలా నాయకత్వంపై వినయ, విధేయతలు ప్రదర్శించడం లేదు. అలాగని చంద్రబాబుపై నేరుగా విమర్శలు చేయడం లేదు. పార్టీ పార్లమెంటరీ సమావేశాలకు సైతం హాజరవుతున్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలకు విధిగా హాజరవుతున్నారు. అయితే విజయవాడ టిడిపి నాయకులను మాత్రం టార్గెట్ చేస్తున్నారు. బుద్దా వెంకన్న, బోండా ఉమా లాంటి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే స్థాయిలో వారి నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. విజయవాడ పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల టిడిపి బాధ్యులతో కేశినేని నానికి పొసగడం లేదు. దీంతో నానిపై హై కమాండ్ ఓ రకమైన అభిప్రాయంతో ఉందన్న ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కేశినేని సోదరుడు చిన్ని పార్టీలో యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో నానిని తప్పించి.. చిన్నికి టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే చిన్ని తన కార్యకలాపాలను విస్తృతం చేశారు. స్థానిక టిడిపి నాయకులతో కలివిడిగా తిరుగుతున్నారు. ఇది నానికి మింగుడు పడడం లేదు. అందుకే నాయకత్వాన్ని సవాల్ చేస్తూ చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలతో సన్నిహితంగా గడిపారు. దీంతో నాని వైసీపీలో చేరుతారు అన్న ప్రచారం హల్చల్ చేసింది.
ఈ తరుణంలో కేశినేని నాని జగన్ సర్కార్ తీరుపై విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబుపై దాడిని ఖండించారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో కేశినేని నాని అభిప్రాయాన్ని మార్చుకున్నారని టిడిపిలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇది వ్యూహమా? వ్యూహాత్మక మా? అన్నది తెలియాల్సి ఉంది.