Ganta Srinivasa Rao: గాలి వాటం రాజకీయం గంటా శ్రీనివాసరావుకు వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడ ఉన్నా.. ఏ పార్టీలో ఉన్నా.. ఆయనకు అధికారమే అల్టిమేట్. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గంటా ఈ నాలుగేళ్ల పాటు పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. అవసరాలను అవకాశాలుగా మలుచుకోవడంలో గంటా ముందువరుసలో ఉంటారు. ఇప్పుడు టీడీపీ యువనేత నారా లోకేష్ ను పట్టుకొని తిరిగి పార్టీలో యాక్టివ్ రోల్ పోషించేందుకు సిద్ధపడుతున్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు.

రెండున్నర దశాబ్దాలుగా విశాఖ రాజకీయాల్లో కీలక నాయకుడిగా గంటా ఎదిగారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. జనాల నాడిని పట్టుకొని ఎన్నికల క్షేత్రంలో దిగడం గంటా ప్రత్యేకత. ప్రతీ ఎన్నికలకు నియోజకవర్గాలను మారడమే సక్సెస్ మంత్రగా మార్చుకున్నారు. టీడీపీలోనే సుదీర్ఘ కాలం కొనసాగారు. పీఆర్పీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. చిరంజీవి వెంట నడిచారు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత చిరంజీవి కేంద్ర మంత్రి కాగా.. రాష్ట్ర మంత్రిగా గంటా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ కకావికలం కావడంతో ఆ పార్టీని వీడి తిరిగి తెలుగుదేశంలోకి ఎంట్రి ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రావడంతో మంత్రిగా చాన్స్ దక్కించుకున్నారు. కానీ గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయేసరికి దూరం జరిగిపోయారు.
గంటా టీడీపీని వీడుతారని జోరుగా ప్రచారం సాగింది. తొలుత వైసీపీలో చేరడానికి ప్రయత్నించినా విజయసాయిరెడ్డి అడ్డుకున్నారన్న వార్తలు వచ్చాయి. తరువాత బీజేపీకి దగ్గరవుతున్నారని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. అటు జనసేనలో చేరతారని భావించినా అదీ జరగలేదు. ఈ నేపథ్యంలో గంటా ఇటీవల నారా లోకేష్ తో సమావేశమయ్యారు. తాను ఏ పార్టీలోకి చేరడం లేదని స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. సుమారు 40 నిమిషాల పాటు లోకేష్ తో సమావేశమై తనపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు పాదయాత్రపై కొన్నిరకాల సలహాలు, సూచనలు ఇచ్చినట్టు సమాచారం. దీనిపై లోకేష్ సంతోషించి తన పాదయాత్రలో కీలక బాధ్యతలను గంటాకు అప్పగించినట్టు ప్రచారం సాగుతోంది.

గత ఎన్నికల తరువాత గంటా పార్టీ కార్యక్రమాలకు హాజరైంది చాలా తక్కువ. చివరకు అధినేత చంద్రబాబు పర్యటనల్లో సైతం పెద్దగా కనిపించిన సందర్భాలు లేవు. పార్టీ సభ్యత్వంతో హైకమాండ్ ఆదేశించిన బాదుడే బాదుడు, ఇదేంఖర్మ రాష్ట్రానికి వంటి కార్యక్రమాలకు సైతం ముఖం చాటేశారు. కానీ ఇప్పుడు సడెన్ గా విశాఖ టీడీపీ కార్యాలయంలో గంటా మెరిశారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. లోకేష్ యువగళం పాదయాత్ర సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. లోకేష్ పాదయాత్ర లక్ష్యం, యువతకిచ్చే ప్రాధాన్యాన్ని వివరించారు. షెడ్యూల్ ను సైతం ప్రకటించారు. లోకేష్ తో సమావేశమై వచ్చిన నాటి నుంచే గంటా యాక్టివ్ కావడం చూస్తుంటే.. తన గాలివాటం రాజకీయాన్ని మరింత పదునెక్కించినట్టేనన్న టాక్ తెలుగు తమ్ముళ్ల నుంచే వినిపిస్తోంది. కానీ విపక్షంలో ఉండడం.. అధికార పార్టీ ఉక్కుపాదం మోపుతున్న వేళ గంటా లాంటి నాయకులు యాక్టివ్ కావడంపై టీడీపీ శ్రేణుల్లో కూడాహర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.