KCR- Rythu Bandhu: రాష్ట్ర ఖజానాకు రైతుబంధు భారంగా మారింది. ఏటా సుమారు 15 వేల కోట్ల భారం పడుతోంది. పైగా రైతుబంధు భూస్వాములకు, పడావు భూములకు ఇవ్వడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరూ వస్తోంది. భూస్వాములకు ఇవ్వడం మూలంగా పథకం ఉద్దేశం కూడా మరుగున పడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రైతుబంధుపై ఓ షాకింగ్ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. పంటలు పండించకుండా వాణిజ్య, వ్యాపారాలకు వినియోగిస్తున్న భూములను రైతుబంధు జాబితాలోంచి తీసేయనున్నట్టు సమాచారం.
ఈసారి ఖజానా ఇప్పటికే ఖాళీ అయింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొంది. కానీ రైతుబంధు కేసీఆర్ మరో మానసపుత్రిక. దాన్ని ఆపడానికి వీల్లేని పరిస్థితి. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లు మొదలయ్యేనాటికి రైతుబంధు వేస్తూ వస్తున్నారు. ఈసారి ఖజానా మీద భారం తగ్గించేందుకు సీఎం కేసీఆర్ సీరియస్‌గా చర్చ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది కూడా రైతుల ఖాతాలో నగదు జమ చేయడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో వ్యవసాయ పట్టా ఉండి అందులో పంటలు పండించకుండా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ రైతుబంధు సొమ్ము అందుకుంటుండటంపై సర్కారు సీరియస్ అయ్యింది. ఇలాంటి భూములు రాష్ట్రంలో ఎన్ని ఎకరాలున్నాయో ప్రభుత్వం సర్వే చేయిస్తోంది.
Also Read: Modi Visit to Hyderabad: మోడీ మళ్లీ హైదరాబాద్ పర్యటన.. అందుకేనా?
రైతుకు సాగు సమయంలో పెట్టుబడి ఖర్చుల నిమిత్తం అండగా ఉండాలని ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టింది. ముందు ఓ సీజన్‌కు ఎకరాకు రూ. 4 వేల చొప్పున వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి రూ. 8 వేలు ఇచ్చింది. ఇప్పుడు సీజన్‌కు ఎకరాకు రూ. 5 వేలు ఇస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 50 వేల కోట్లకు పైగా రైతులకు సాయం చేసింది. ఈ ఏడాది యాసంగిలో 1.48 కోట్ల ఎకరాలకు సంబంధించి 63 లక్షల మంది రైతులకు రూ. 7,412 కోట్లు అందజేసింది. 2021-22 వ్యవసాయ సీజన్‌లో మొత్తం రూ. 14,772 కోట్లు అందజేసింది.
పంట పండించే రైతులకు కాకుండా పట్టా ఉండి, వేరే పనులు చెయిస్తున్న భూములకు ఇవ్వడం తగదని, సర్కారు సర్వే నిర్వహిస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, వికారాబాద్ సహా అనేక జిల్లాల్లో ఇలాంటివి లక్షలాది ఎకరాలు ఉండొచ్చని అంటున్నారు. ఈ భూములు 10 లక్షల ఎకరాలు వెలుగుచూసినా ప్రభుత్వానికి ఏటా రూ. వెయ్యి కోట్లు ఆదా కానుంది. రైతుబంధు విధాన నిర్ణయం తమ పరిధిలోది కాదని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు.
Also Read:CM KCR- Nikhat Zareen- Esha Singh: కేసీఆర్ సార్.. ఇంత ఆర్థిక దుస్థితిలో వారికి రెండు కోట్లా?