KCR On Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పాలనపై రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. కేఆర్‌ఎంబీపై తెగించి కొట్లాడాలని నాయకులకు సూచించారు. తుంటి ఎముక శస్త్ర చికత్స తర్వాత తొలిసారి మంగళవారం తెలంగాణ భవన్‌కు వచ్చారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం నిర‍్వహించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తేవాలని కేంద్రం ఒత్తిడి తెచ్చిందన్నారు. అయితే అందుకు తాను అంగీకరించలేదని తెలిపారు. ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాని రద్దు చేసి తీసుకోవాలని చెప్పానన్నారు.
నా పోరాటం ఒక్కరిపై కాదు..
రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని సూచించారు. తన పోరాటం ఒక్కరిపై కాదని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉడుత బెదిరింపులకు భయపడేది లేదని స‍్పష్టం చేశారు. ‘రేవంత్‌రెడ్డి నన్ను, బీఆర్‌ఎస్ పార్టీని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారన్నారు. నన్ను, నా పార్టీని టచ్ చేయడం ఈ సీఎం వల్ల కాదు. తెలంగాణ విషయంలో కేసీఆర్ ఏనాడు వెనక్కు పోడు. రేవంత్‌రెడ్డి కన్నా హేమా హేమీలను ఎదుర్కొన్న చరిత్ర నాది. పదేళ్లు తెలంగాణను కాపాడుకున్నం. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని పారాయిపాలు చేస్తోంది’ అని విమర్శించారు. ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐదు జిల్లాల నుంచి జన సమీకరణ చేయాలని నాయకులకు సూచించారు.