
CM KCR: జై భీమ్ సినిమా చూశారా.. అందులో ఓ శ్రీమంతుడి బంగారు గొలుసు పోతుంది. పోలీసులు అనుమానంతో దళితుడిని అరెస్టు చేస్తారు. తీవ్రంగా హింసించి చంపేస్తారు. కానీ పోలీసుల తప్పిదాన్ని కోర్టులో నిరూపించేందుకు ఆ దళితుడి భార్య ఒక యుద్ధమే చేస్తుంది. ఇదేదో సినిమాటిక్ కథ కాదు. సీనియర్ న్యాయవాది చంద్రు స్వయంగా వాదించి గెలిపించిన కేసు ఇది. ఇలాంటి ఘటనలు అప్పట్లో కాదు, ఇప్పట్లోనూ జరుగుతున్నాయి.
నల్లగొండ జిల్లా అడ్డ గూడూరు పోలీస్ స్టేషన్లో అప్పట్లో మరియమ్మ అనే దళిత మహిళ లాకప్ డెత్ కు గురైంది. చింతకాని మండలానికి చెందిన దళిత మహిళ అడ్డగూడూరులో ఓ పాస్టర్ ఇంట్లో పని చేస్తోంది.. అతడి ఇంట్లో బంగారు గొలుసు పోయింది. ఎవరు తీసారో తెలియదు. కానీ పాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, మరియమ్మ మీద అనుమానం ఉందని చెప్పడంతో.. చేయని దొంగతనానికి దళితురాలు నిందితురాలుగా మారింది. పోలీసులు మహిళ అని చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో చనిపోయింది.
ఇక ఇలాంటి దొంగతనం కేసులోనే ఖదీర్ అనే ఓ ముస్లిం మెదక్ జిల్లా పోలీసులు చిత్రవధకు గురిచేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు అతడి మూత్రపిండాలు పాడైపోయాయి. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు కన్నుమూశాడు. అతడి మృత దేహాన్ని కూడా ఊళ్లోకి తీసుకెళ్లకుండా పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేశారు. పోస్టుమార్టం పత్రాలు తగులపెట్టారు. మృతదేహాన్ని రెండు మూడు అంబులెన్సులలో మార్చారు. డబ్బులు ఇస్తాము, ఎవరికీ ఏమి చెప్పొద్దంటూ ఖదీర్ భార్యను బెదిరించారు. కానీ మీడియాలో ప్రముఖంగా రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పై రెండు కేసుల్లో సమిధలయింది సామాన్యులు. వారిద్దరు కూడా పేద కుటుంబాలకు చెందిన వారు. ఒక దొంగతనం కేసులోనే అనుమానం ఉన్నది కాబట్టి పోలీసులు వీరిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. మరి ₹వేల కోట్ల కుంభకోణంలో కవిత పాత్ర ఉందని ఈడి ఘంటా పథంగా చెబుతున్నప్పుడు కవిత విచారణకు ఎందుకు వెనుకాడుతున్నట్టు? తెలంగాణ పోలీసుల మాదిరి ఈడీ అధికారులు వ్యవహరిస్తున్నారా? లేదు కదా! సామాన్యులకు ఒక న్యాయం? కవితకు ఒక న్యాయమా? ఇదెక్కడి బంగారు తెలంగాణ? ఇదెక్కడి గుణాత్మక మార్పు? ఇలాంటి మార్పునైనా కేసీఆర్ భారతదేశంలో అమలు చేస్తామని చెబుతోంది? ఆ మధ్య అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందదేనని, నా కొడుకు, కూతురైనా ఉపేక్షించేది లేదన్నారు. మరి ఆ లెక్కన చూసుకుంటే కవిత అప్పుడే విచారణకు హాజరు కావాలి కదా! మరి ఆమెను కాపాడేందుకు కేసీఆర్ ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు? ఈ చర్యల ద్వారా తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు?
కేసిఆర్ కూతురు అయినంత మాత్రాన ప్రత్యేక అధికారాలు ఉంటాయా? ఇదెక్కడి కేసీఆర్ మార్క్ న్యాయం? దీనిని ఆయన ఎలా సమర్థించుకుంటారు? ఎప్పుడైతే కవిత పేరు లిక్కర్ స్కాం లో వినిపించిందో అప్పుడే తన సచ్చీలతను నిరూపించుకోవాలని కెసిఆర్ ఆదేశించాల్సి ఉండేది. అప్పుడు జనాలకు కూడా భారత రాష్ట్ర సమితి పై నమ్మకం ఏర్పడేది. కానీ ఆయన తన చర్యల ద్వారా తన కుటుంబ సభ్యులు వేరు, తెలంగాణ ప్రజలు వేరు అనే సంకేతాన్ని ఇచ్చారు.. మరియమ్మ కేసులో కూడా ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. ఆ పోలీసులను సర్వీసు నుంచి డిస్మిస్ మాత్రమే చేసిన ప్రభుత్వం.. ఇంతవరకు కేసులు పెట్టకపోవడం విశేషం.