KCR- Lands Auction: రోజుకో కొత్త పథకం తెరపైకి వస్తోంది. మళ్లీ అధికారం దక్కించుకునేందుకు అధికార పార్టీ నాలుకకు ఎముకే లేదన్నట్టుగా ఎడాపెడా హామీలు ఇస్తోంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం పడుతున్నది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కాస్త అప్పుల మాయమైంది. పైగా కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగు లాగా మారింది. అటు చూస్తే కేంద్రంతో వైరం వల్ల అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. ఇటు చూస్తే లిక్కర్, రిజిస్ట్రేషన్, మైనింగ్ తప్ప ఆదాయం వచ్చే మార్గాలు కనబడటం లేదు. ఈ రంగాలపై ఇప్పటికే ప్రజలకు మోత ఎక్కేలా పనులు పెంచింది. ఇప్పట్లో వీటిపై కూడా పన్నులు పెంచే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో 111 జీవోను ఎత్తి వేసినా సర్కార్ కు అంత ఉపశమనం కలగలేదు. ఎందుకంటే కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో.. దీనిపై ధర్మాసనం స్టే విధించింది. ఇక ఎక్కడికి అక్కడ ఆదాయ మార్గాలు మూసుకుపోతుండడంతో ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వానికి పాలు పోవడం లేదు. పులి మీద పుట్రలా వీఆర్ఏలు కొద్దిరోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారు. వేతనాలు రాక ఇప్పటికే చాలా మంది వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ముప్పేట ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి నగదు లభ్యత ఇప్పుడు తక్షణ అవసరం. ఈ క్రమంలోనే నిధులు సమకూర్చుకునేందుకు భూములు అమ్మాలని నిర్ణయించుకుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోకాపేట భూములు అమ్ముతున్నప్పుడు ఇప్పుడు ఐటి శాఖ మంత్రిగా ఉన్న కల్వకుంట్ల తారక రామారావు అప్పట్లో నిరసనలు వ్యక్తం చేశారు. తెలంగాణలో భూములు అమ్మేందుకు సీమాంధ్ర పాలకులకు అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. సీన్ కట్ చేస్తే స్వరాష్ట్రంలో ఇక్కడి పాలకులే తెలంగాణలో భూములు అమ్మేందుకు ముందుకు రావడం గమనార్హం. అంటే పాలకులు మాత్రమే మారారు. కానీ ప్రజల కష్టాలుఅలాగే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో హైదరాబాద్ నగర పరిధిలో ఆజామాబాద్, బాలానగర్, హఫీజ్పేట్ లో భారీగా భూములు ఉన్నాయి. ఈ భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి 2,849 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒరిజినల్ అలాటీస్ కు అమ్మితే 1,627.54 కోట్లు, ఇతరులకు విక్రయించడం ద్వారా 1,221.73 కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆజామాబాద్ పరిధిలో రిజిస్ట్రేషన్ విలువ గజానికి 43,500 ఉన్నది. హఫీజ్ పేటలో 26,500, బాలానగర్ లో గజానికి 23 వేలు ఉంది. ఆ ప్రకారం ఒరిజినల్ అలాటీస్ కు అమ్మాయిల ప్లాన్ చేశారు. ఇతరులకు రిజిస్ట్రేషన్ విలువకు డబుల్ చేసి అమ్మనున్నారు. ఒకవేళ ఒరిజినల్ ఒలాటిస్ వద్దు అనుకుంటే ఇతరులకు డబుల్ రేటు కే విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. నాన్ ఒరిజినల్ అలాటిస్ కు విక్రయంపై మరింత ఆదాయం ఎలా సమకూర్చుకోవాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని మార్గాలు వెతుకుతోంది.
ఈ భూములన్నీ గతంలో కేటాయించినవే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆజామాబాద్, బాలనగర్ కోపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, హఫీజ్పేట్ మినీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఫ్రీగా భూములు కేటాయించింది. కానీ ఈ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో నిరర్ధకంగా ఉన్నాయి. ఈ భూములను డిసెంబర్ 15వ తేదీ లోపు అమ్మేందుకు ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో భూములు అలాటై ఉన్నవారికి మార్కెట్ విలువ ప్రకారం, ఇతరులకు మార్కెట్ రేట్లు డబుల్ ఇస్తే ఏ మేరకు ఆదాయం వస్తుందనే దానిపై ప్రభుత్వం ప్రాథమిక లెక్కలు వేసుకుంటున్నది. దీని ప్రకారం ఈ మూడు పారిశ్రామిక ఎస్టేట్ లలో 125 ఎకరాలు దాదాపు 6.6 లక్షల గజాలు అమ్మకానికి రెడీగా ఉంది. ఈ విక్రయం ద్వారా 2900 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. ఇదిలా ఉండగా గతంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఎక్కడెక్కడ ఎంత భూమి కేటాయించారు? వాటిల్లో ఏం యూనిట్లు నడుస్తున్నాయి? ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే దానిపై ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంది. ఇక ఆజామాబాద్, బాలానగర్, హపీజ్ పేట ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లో మొత్తం 355 యూనిట్లు ఉన్నాయి. ఇందులో ఒరిజినల్ అలాటీస్ కు 84 యూనిట్లు ఉన్నాయి. వీటి పరిధిలో 3.98 లక్షల చదరపు గజాల భూమి ఉన్నది. ఆజామాబాదులో 36 యూనిట్లకు 3.41 లక్షల చదరపు గజాలు, హఫీజ్పేట్ ఎంఐఈ లో 21 యూనిట్లకు 25,249 చదరపు గజాలు, బాలానగర్ సీ ఐ ఈ లో 27 యూనిట్లకు 37,713 చదరపు గజాల భూమి ఉన్నది.

రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఒరిజినల్ అలాటిస్ కే అమ్మితే ఎంత ఆదాయం వస్తుందనే దానిపై కూడా ప్రభుత్వం లెక్క కట్టింది. ఇక వీటి పరిధిలో ఒరిజినల్ అలాటీస్ కాకుండా 279 యూనిట్లు ఉన్నాయి. అధికంగా బాలనగర్ లో 234 నాన్ ఒరిజినల్ ఆఫీస్ ఉన్నారు. ఈ మొత్తం కలిపి 2.7 లక్షల చదరపు గజాలు ఉన్నది. ఒకవేళ వీళ్లకు భూములను అమ్మితే రిజిస్ట్రేషన్ విలువకు రెట్టింపు వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లకు సంబంధించిన భూముల అమ్మకం మూడు నెలల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఇటీవల సమావేశమై ఈ భూముల అమ్మకంపై సమీక్ష నిర్వహించడం గమనార్హం. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనల్లో ఈ ఇద్దరు నేతలు కూడా పాల్గొన్నారు. కానీ సొంత రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకానికి సంబంధించి సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మాట్లాడితే కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతోందని ట్విట్టర్ లో విమర్శించే కేటీఆర్ ఈ భూముల అమ్మకానికి సంబంధించి ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి. అయితే బిజెపి ఐటి సెల్ నాయకులు తెలంగాణలో భూముల అమ్మకాన్ని నిరసిస్తూ ట్విట్టర్లో కేటీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు.