Chandrababu- KCR: కేసీఆర్ అపార రాజకీయ చాణుక్యుడు. రాజకీయంగా ఎవరికి అందనంత రీతిలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. అవసరమైతే స్నేహం చేస్తారు.. లేకుంటే కలబడతారు.. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేయగలరు. మరీ అవసరమనుకుంటే కాళ్లబేరానికి దిగగలరు. భవిష్యత్ లో చంద్రబాబుతో తనకు దెబ్బ అని తెలిసి తెలంగాణ సమాజం నుంచి ఎలా దూరం చేశారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన క్రమంలో గతంలో మాదిరిగా స్పీడ్ ఉంటుందా అన్న అనుమానం అందరిలోనూ నెలకొంది. కానీ ఆయన ఆలోచన చూస్తుంటే మాత్రం ఆ జోరు తగ్గలేదని తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ విస్తరణ నిర్ణయం తీసుకున్నారో లేదో… చంద్రబాబు తెలంగాణలో ఎంటరయ్యారు. అయితే అదే స్పీడుతో కేసీఆర్ కూడా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంటరైపోయారు. మరో తొమ్మిది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు ఉన్నా.. అవేవీ పట్టించుకోకుండా ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై ఫోకస్ పెంచారు. చంద్రబాబు తీసుకున్న డిసిషనే అందుకు కారణం.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఒంటరి ప్రయాణానికి భయపడుతున్నారు. పొత్తులతో ముందుకెళితేనే జగన్ ను ఓడించగలమని డిసైడ్ అయ్యారు. అటు పవన్ కూడా పొత్తుపై సానుకూలంగా ఉన్నారు. ఎటొచ్చి బీజేపీ విషయమే తేలడం లేదు. కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణతో చంద్రబాబు బీజేపీతో స్నేహం చేయడానికి ఒక మార్గం దొరికింది. తెలంగాణలో కేసీఆర్ తో బీజేపీ గట్టి పోరాటమే చేస్తోంది. ప్రధాన విపక్షం కాంగ్రెస్ ను పక్కకు తప్పించి మరీ ఫైట్ కు దిగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగుతోంది. అక్కడ ఏచిన్న అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. దీంతో చంద్రబాబు తెలంగాణలో ఎంటరయ్యారు. టీడీపీకి ఉన్న కొద్దిపాటి బలాన్ని పోగుచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సెటిలర్స్ అధికంగా ఉండే నియోజకవర్గాలు, ఆంధ్రా మూలాలు ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసుకుంటున్నారు.ఖమ్మంలో భారీబహిరంగ సభ నిర్వహించి పార్టీని విడిచిన నాయకులంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. అయితే చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలన్ని బీజేపీ కోసమేనంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం ప్రారంభించారు. అప్పటివరకూ కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణ ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్ సడన్ గా ఏపీపై ఫోకస్ పెట్టారు. కొంతమంది నాయకులను పార్టీలోకి రప్పించారు. ఏకంగా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడి నియామకం చేపట్టారు.
ఏపీ అవసరాల కోసం తెలంగాణలో చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని కేసీఆర్ కు తెలుసు. తెలంగాణలో టీడీపీ గెలిచే చాన్స్ లేకున్నా.. ఇతర పార్టీలను గెలిపించే సత్తా ఉంది. అందుకే చీలిపోయిన టీడీపీ శ్రేణులను ఏకతాటిపైకి తేవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో పొత్తు కోసం బీజేపీ చేతిలో పెట్టేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని గ్రహించిన కేసీఆర్ ఏపీలో ఆట మొదలుపెట్టారు. చంద్రబాబును ఆత్మరక్షణలో పడేసే ప్లాన్ ను బయటకు తీశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు టీడీపీ, జనసేన సిద్ధపడుతున్న తరుణంలో.. ఆ రెండు పార్టీల బలాలు, బలహీనతలను అంచనా వేశారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణలను దృష్టిలో పెట్టుకొని జనసేన నేత తోట చంద్రశేఖర్ ను తనవైపు తిప్పుకున్నారు. కాపు సామాజికవర్గంతో పాటు ఏపీలో అధికారంలోకి రావడానికి కారణమయ్యే గోదావరి జిల్లాల నుంచి నేతల చేరికలను ప్రోత్సహించారు. తద్వారా కాపుల ఓట్లలో చీలిక తెచ్చి టీడీపీ, జనసేన కూటమిని దెబ్బకొట్టాలన్నది కేసీఆర్ ప్లాన్.

అయితే నాయకుల వరకూ ఓకే కానీ.. ఏపీ ప్రజలు కేసీఆర్ బీఆర్ఎస్ ను ఆహ్వానిస్తారా? అన్నది ఇప్పుడు లోతుగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజనకు ముందు, తరువాత ప్రాంతీయ వాదాన్ని బలపరిచే క్రమంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రజలు ఇప్పటికీ గుర్తుచేస్తున్నారు. పైగా నాడు అమరావతి రాజధానికి మద్దతుగా కేసీఆర్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేశారు. అమరావతి రాజధానికి మద్దతు తెలిపారు. ఇప్పుడు తన స్నేహితుడు జగన్ తీసుకున్న మూడు రాజధానులపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే ప్రజలు కేసీఆర్, జగన్ ఒక్కటేనన్న నిర్థారణకు వస్తారు. కేసీఆర్ ను ప్రజలు నమ్మేస్థితిలో లేరని టీడీపీ నేతలు చెబుతున్నారు. అటు వైసీపీలోని కొంతమంది నాయకులు అదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే రెండు దయాది రాష్ట్రాల్లో చంద్రులు రాజకీయం మొదలుపెట్టారు. మరి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి మరీ.