https://oktelugu.com/

Modi- KCR: మోదీ ‘జమిలి’ దెబ్బ.. కేసీఆర్‌ ప్లాన్‌ పటాపంచలు!

వచ్చే ఏడాది జనవరిలో దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం ముగియనుంది. ఇందులో రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ కూడా ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 13, 2023 4:12 pm
    Modi- KCR

    Modi- KCR

    Follow us on

    Modi- KCR: జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ.. బీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఓటర్ల మైండ్‌సెట్‌లో మార్పు వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించే స్థానిక అంశం పక్కకుపోయి లోక్‌సభ ఓటింగ్‌లో వ్యక్తమయ్యే జాతీయ అంశమే డామినేట్‌ చేస్తుందేమోననే గుబులు సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లో మొదలైంది. ఓటర్ల మైండ్‌సెట్‌పైనా, పోలింగ్‌ సరళిపైనా ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. జమిలి వల్ల రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనంత మ్యాజిక్‌ ఫిగర్‌ వస్తుందో రాదోననేంత స్థాయిలో కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

    మూడు రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు..
    వచ్చే ఏడాది జనవరిలో దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం ముగియనుంది. ఇందులో రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ కూడా ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలతోపాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ అధికారం లోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు ప్లానింగ్‌ లేకుండా కేంద్రం వేసిన జమిలి అడుగులు.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను గందరగోళంలోకి నెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలను కార్నర్‌ చేయడానికి ఆ పార్టీల కన్నా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి అడ్వాన్స్‌ మోడ్‌లోకి వెళ్లిపోయామని భావిస్తున్న తరుణంలో ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’ బిల్లు.. గులాబీ యాక్షన్‌ ప్లాన్‌ను పటాపంచలు చేసినట్లయింది.

    మోదీ ప్లాన్‌ ఇదీ..
    జమిలి ఎన్నికల ద్వారా ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతోపాటు కేంద్రంలోనూ మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలని మోదీ ప్లాన్‌. ఈమేరకు ఆయన పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో త్వరలో గడువు ముగిసే అసెంబ్లీలతోపాటు.. వచ్చే ఏడాది చివరి నాటికి గడువు ముగిసే రాష్ట్రాల అసెంబ్లీలకు 2024 మేలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఫలితంగా మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ ద్వారా ఎన్నికల వ్యయం కూడా తగ్గుతుందని కేంద్రం పేర్కొంటోంది.

    మోదీ ప్లాన్‌తో కేసీఆర్‌ ఆశలు గల్లంతు
    జాతీయ, స్థానిక అంశాల ప్రయారిటీల్లో మార్పు వచ్చి అది ఎలాంటి చేటు చేస్తుందోననే గుబులు బీఆర్‌ఎస్‌ నేతల్లో మొదలైంది. జమిలి కారణంగా అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమైతే ఎలాంటి ముప్పు ఎదురవుతుందోననే భయం ఆ పార్టీ అభ్యర్థులను వెంటాడుతున్నది. పార్టీ అధినేత స్ట్రాటెజీపైనే ఇప్పుడు క్యాండిడేట్లు, జిల్లా పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు.

    మ్యాజిక్‌ ఫిగర్‌పైనే అనుమానం..
    ఈసారి ఎన్నికల్లో గతం కన్నా నాలుగైదు సీట్లు ఎక్కువే వస్తాయని, 95–105 స్థానాల్లో విజయం సాధిస్తామని కేసీఆర్, కేటీఆర్‌ పలు సందర్భాల్లో ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరిగిందనే జనరల్‌ టాక్‌ రాష్ట్రంలో వినిపిస్తున్నది. కేసీఆర్‌ మాత్రం దానిని పైకి కనిపించనీయకుండా తనదైన శైలిలో వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. పక్కా వ్యూహం ప్రకారం ఇతర పార్టీల కన్నా ముందే అభ్యర్థులను ప్రకటించారు. కానీ ఇప్పుడు జమిలి కదలికతో గులాబీ బాస్‌ ఆలోచనలో పడ్డారు. కనీసం మ్యాజిక్‌ ఫిగర్‌ అయినా వస్తుందో లేదోనని లెక్కలు వేసుకుంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు.