BL Santhosh- KCR: ” ఏమోయ్ కేసీఆర్… మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్ నువ్వే రచించి… నా మీద కేసు పెట్టిస్తావా? నన్నే బజారుకు లాగాలని చూస్తావా? నీ లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇక చూసుకుందాం అంటూ” బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ గుడ్లు ఉరిమాడు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో తనను ఇరికించారని కోపమో, తనను అనవసరంగా బద్నాం చేశారని ఆగ్రహమో తెలియదు కానీ కెసిఆర్ మీద ఒంటి కాలి పై లేచాడు. అంతేకాదు తెలంగాణ డబ్బును ఇతర రాష్ట్రాల్లో ఎంత ఇచ్చారో లెక్క తన దగ్గర ఉందని, తగిన సమయంలో బయటపెడతామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అటు భారత రాష్ట్ర సమితి, ఇటు భారతీయ జనతా పార్టీ మధ్య వైరం మరింత పాకాన పడింది.

తప్పుడు ఆరోపణలు
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో తనను అనవసరంగా ఇరికించారని బిఎల్ సంతోష్ అంటున్నారు. ఏకంగా తెలంగాణ గడ్డమీదికి వచ్చి కేసిఆర్ కు సవాళ్లు విసురుతున్నారు.. అంతేకాదు పాడి ఆవు లాంటి తెలంగాణను వాడుకొని తర్వాత ఏదో ఒక రోజు చంపేస్తారని జోస్యం చెప్పారు..” అదేమైనా ఆయన కష్టపడి వ్యాపారం చేసి సంపాదించిన డబ్బా? బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఇచ్చి వస్తున్నారా? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నది? ఇతర రాష్ట్రాల్లో వెదజల్లుతున్న డబ్బు అంతా తెలంగాణ తల్లి పేరు చెప్పి దోచుకున్నది కాదా” అని తీవ్రమైన పదాలతో కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. బెంగాల్ ఎన్నికల్లో మమతకు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో తమ వద్ద సమాచారం ఉందని బిఎల్ సంతోష్ బాంబు పేల్చారు.
సొంత పార్టీ నేతలకు కూడా క్లాస్
కాస్త జనాల్లో ప్రాబల్యం పెరిగే సరికి బిజెపి నాయకులు ఎవరికి వారు వేరుకుంపట్లు పెట్టుకున్నారు. దీనివల్ల పార్టీ పురోగతి క్షేత్రస్థాయిలో ఆశించినత మేర లేదు. దీనిపై బీఎల్ సంతోష్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈర్ష్య, ద్వేషాలు వద్దని ముఖ్య నేతలకు హితవుపలికారు.. జూనియర్, సీనియర్ నాయకులు తారతమ్యాలు చూపొద్దని మందలించారు.. గంగ, యుమున నదులు ప్రయోగ వద్ద కలిశాక 15 కిలోమీటర్ల వరకు రెండు నదుల నీటి తేడా కనిపిస్తుందని, తర్వాత రెండూ కలిసిపోతాయని గుర్తు చేశారు.. బిజెపిలోకి కొత్తగా చేరిన వారికి ఇక్కడి సిద్ధాంతాలు పార్టీ పని తీరు కొత్తగా అనిపించవచ్చని, కొద్ది రోజుల తర్వాత వారు కలిసిపోతారని వివరించారు.

బీఆర్ఎస్ వల్లే నాకు గుర్తింపు
అంతకుముందు తనను ప్రోటోకాల్ ప్రకారం ఒకరు ఇద్దరు నాయకులు వచ్చి స్వాగతం పలికేవారు.. కానీ భారత రాష్ట్ర సమితి నాయకుల కారణంగా బిఎల్ సంతోష్ అంటే ఎవరో తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.. విమానాశ్రయంలో తనకు వేలాది మంది కార్యకర్తలు వచ్చి స్వాగతం పలికారని సంతోష్ గుర్తు చేసుకున్నారు.. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రాచుర్యం కల్పించిందని చలోక్తి విసిరారు.. ఫామ్ హౌస్ కేసులో తనను అక్రమంగా ఇరికించిన వారు తప్పనిసరిగా పర్యవసనాలు అనుభవిస్తారని ఆయన వెల్లడించారు.. అయితే ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగ ప్రవేశం చేయడంతో బిఎల్ సంతోష్ తన స్వరాన్ని మరింత పెంచారు. మరోవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా కోరల్లేని పాము కావడంతో కెసిఆర్ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. సంతోష్ సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.