‘‘బేసిన్లు, భేషజాలూ లేవు. కలిసి మెలిసి ఉందాం. నీళ్లు పంచుకుందాం’… అన్న కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రా ప్రాజెక్టులపై కస్సుమన్నారు!
‘‘కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హాజరై.. గోదావరికి పూజ చేసిన జగన్.. ‘మీ ప్రాజెక్టుకు అనుమతులెక్కడున్నాయి?’’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
మొన్నటివరకు హలో బ్రదర్స్‌లా ఉన్న.. ఇప్పుడు ఈ ఇద్దరికి ఏమైంది..? ఇరు రాష్ట్రాల ప్రజలందరూ అన్నదమ్ములమే అని చెప్పుకున్న వీరి మధ్య జల జగడం ఎందుకు పుట్టింది..? రాజకీయ మిత్రులు.. ఇప్పుడు శత్రువులుగా ఎందుకు మారారు..? ఒకప్పుడు హలో హలో బ్రదర్ అనుకుంటూ సాగిన వీరి మధ్య నీరే పెట్రోలులా మారి అగ్గి రాజేసిందా..? ‘ఇద్దరు అన్నదమ్ముల మధ్య కొట్లాట వస్తే.. మధ్యలో ఓ పెద్ద మనిషి వచ్చి దాన్ని సాల్వ్ చేయాలి’ అన్నట్లు.. ఈ ఇరు సీఎంల పిట్ట పోరుకు కేంద్రం ‘పెద్దన్న’ పాత్ర పోషించాల్సి వస్తోంది. ‘మనంమనం మాట్లాడుకుందాం..’ అన్న మాటలను పక్కన పెట్టి ఇప్పుడు కేంద్రాన్ని ఆశ్రయించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం మంగళవారం వాడివేడిగానే సాగింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పరస్పరం విమర్శలకు దిగినట్లు తెలిసింది.
Also Read: దుబ్బాకలో త్రిముఖ పోరు.. బరిలో గెలిచేదెవరు?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హైదరాబాద్ నుంచి, ఏపీ సీఎం జగన్ ఢిల్లీ నుంచి ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు రెండు గంటలపాటు కొనసాగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా, గోదావరి నదీ జలాలపై హక్కులు, వాటాల గురించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను, వాదనలను వినిపించారు. సమావేశంలో ఎజెండా అంశాల వారీగా కాకుండా ఖరారు చేసిన నాలుగు ఎజెండాలపై కేంద్రం ఒకేసారి తన అభిప్రాయాలను సీఎంల ముందు ఉంచింది. కేంద్రం తన అభిప్రాయాలు తెలియజేసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడారు. కృష్ణ, గోదావరి నదీ జలాల పంపిణీకి ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
‘‘ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయకుండా మీరు ఏది చేసినా వృథానే. అన్ని సమస్యలకు ట్రైబ్యునళ్ల ఏర్పాటే పరిష్కారం’’ అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆయన పదే పదే ప్రస్తావించి, పట్టు పట్టారు. ఏ ఎజెండాపై చర్చిస్తున్నా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గుర్తు చేశారు. దీంతో ఈ అంశంపై వినతిపత్రం పంపిస్తే గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ ఏర్పాటు గురించి పరిశీలిస్తామని కేంద్ర మంత్రి అన్నారు. ఆ లేఖను బుధవారమే పంపిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.
శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులతోపాటు కృష్ణానదిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టులనూ కేంద్రమే స్వాధీనం చేసుకుని వాటిని నిర్వహించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. అప్పుడే ఇరు రాష్ట్రాలకూ నీటివినియోగంలో సమన్యాయం జరుగుతుందన్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 841 అడుగులకు తగ్గితే రాయలసీమ, నెల్లూరు జిల్లాల దాహార్తిని తీర్చలేని పరిస్థితి ఎదురవుతుందని, అందుకే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని జగన్ ఈ సందర్భంగా చెప్పారు. ఇది సాధ్యపడకపోతే శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, సాగర్ కుడి కాలువను ఆంధ్రకు స్వాధీనపరచాలని కోరినట్లు తెలిసింది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడానికి ఏపీ ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు ఏ అనుమతులు లేవని, అలాంటిది దాని సామర్థ్యం పెంచడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి ఏపీ సీఎం జగన్.. ‘అనుమతులు లేకుండానే గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులు చేపడుతున్నారు. సీతారామ ప్రాజెక్టుతోపాటు అనేక ప్రాజెక్టులకు అనుమతులు లేవు. మాకో న్యాయం వాళ్లకో (తెలంగాణకు) న్యాయమా? తెలంగాణకు ఏ నిబంధన వర్తిస్తుందో మాకూ అదే వర్తిస్తుంది’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
దీనికి కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ ఉన్నాయని, ఆ ప్రాజెక్టు నది బేసిన్‌లో ఉందని, కానీ రాయలసీమ ప్రాజెక్టు ద్వారా నది బేసిన్ బయటికి నీళ్లు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇలాగైతే… తాము కూడా జూరాల దిగువలో భారీ బ్యారేజిని నిర్మించి, రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్టు చేస్తామని అన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న షెకావత్.. న్యాయం, నిబంధనలు రెండు రాష్ట్రాలకూ సమానమేనని, చట్ట ప్రకారమే అన్నీ జరగాలని పేర్కొన్నట్లు తెలిసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వాదనలు విన్న కేంద్ర మంత్రి.. ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందిస్తే తాము అన్నీ పరిశీలిస్తామని వారికి సూచించారు. అందుకు ఏపీ ముఖ్యమంత్రి అంగీకరించారు. దాంతో కేసీఆర్ కూడా ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించడానికి అంగీకరించారు.
అలాగే గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు తరలించే నీటి కోటాపైనా అపెక్స్‌లో చర్చ జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం పట్టిసీమ నుంచి తరలిస్తున్న గోదావరి నీటిలో 45 టీఎంసీలు తమకు రావాల్సి ఉందని తెలంగాణ వాదిస్తున్నది. ఈ నేపథ్యంలో.. ‘కొత్త ట్రైబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తున్నందున, ఈ నీటి వాటాలపై అవే నిర్ణయం తీసుకుంటాయి. నీటి కేటాయింపుల్లో రాష్ట్రాల మాదిరిగానే కేంద్రానికి కూడా ఏలాంటి అధికారం లేదు’ అని కేంద్ర మంత్రి భేటీలో సూచించినట్టు తెలిసింది. కృష్ణా, గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డుల పరిధులు, అధికారాలను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీకి నిర్ణయం బోర్డులకు అధికారాలను నిర్ధారిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే జగన్ ఇందుకు సానుకూలంగా స్పందించారు. మరో పక్క బోర్డులకు అధికారాలను అప్పగించే అధికారం కేంద్రానికి ఉందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. దాంతో బోర్డులకు అధికారాలను అప్పగించాలని అపెక్స్‌లో నిర్ణయించారు.
Also Read: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త… !
ఈ నిర్ణయం మేరకు.. తెలంగాణ ఫిర్యాదు చేసిన రాయలసీమ లిప్టు వంటి కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను ఏపీ ప్రభుత్వం సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, ఏపీ ఫిర్యాదు చేసిన.. పాలమూరు-రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం మూడో టిఎంసీ, సీతారామ వంటి ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను తెలంగాణ ప్రభుత్వం బోర్డులకు సమర్పించాల్సి ఉంటుంది. అందుకు ఇద్దరు ముఖ్యమంత్రులూ అంగీకరించారు.
అయితే.. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు అయిన తర్వాత సమావేశం నిర్వహించడం ఇది రెండో సారి. అలా కాకుండా ఇకపై ఏటా దీన్ని నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేశారు. సీఎం జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరుకావడం.. తెలంగాణలోని అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్ రావడంతో అందరూ మంచి రోజులే అని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు నెలకొన్ని ఈ జల జగడం ఎక్కడికి దారితీస్తుందో తెలియకుండా ఉంది. సై అంటే సై అంటూ సాగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని చూస్తుంటే మున్ముందు ఈ వివాదాలు సమసిపోతాయా.. మరింత రాజుకుంటాయా..? చూడాలి మరి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Kcr what leads to the water fight of jagan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com