ఇప్పుడు తెలంగాణలో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతోపాటు ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. నిజానికి ఈ ఎన్నికలను కేటీఆర్ పర్యవేక్షించాల్సి ఉంది. కానీ.. ఆయన కొవిడ్ బారిన పడి.. హోం ఐసోలేషన్లో రెస్ట్ తీసుకుంటున్నారు. కేసీఆర్ కు సైతం కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ.. ఆయనలో పెద్దగా లక్షణాలు లేవని ముందు నుంచీ చెబుతున్నారు.
ప్రస్తుతం ఫామ్ హౌజ్ లో చికిత్స తీసుకుంటున్న ముఖ్యమంత్రి ఆరోగ్యం మెరుగు పడినట్టు సమాచారం. దీంతో.. ఆయనే మునిసిపల్ ఎన్నికల బాధ్యతలు మొత్తం చూస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలో రెండో చోట్లా టీఆర్ఎస్ అధికారంలో ఉంది. మరోసారి వాటిని పూర్తి మెజారిటీతో దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నారు గులాబీదళపతి.
అయితే.. ఖమ్మంలో బీజేపీ బలం పెద్దగా లేదు. ప్రతాపం ఏమైనా చూపిస్తే.. వరంగల్ లోనే చూపించాల్సి ఉంది. ఇందుకోసం కమలదళం తమ ప్రయత్నాల్లో తాముంది. ఇటు కేసీఆర్ మాత్రం.. పూర్తిస్థాయి ఆధిపత్యంతో కార్పొరేషన్ కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీచేశారట. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఫలితాల్లో తేడావస్తే.. వారి రాజకీయ భవిష్యత్ లోనూ తేడాలు ఉంటాయని చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. దీంతో.. వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతున్నట్టు సమాచారం.
మిగిలిన మునిసిపాలిటీల పరిధిలోని నేతలకు సైతం ఇదే తరహా ఆదేశాలు జారీచేశారట కేసీఆర్. ఈ మునిసిపాలిటీ ఎన్నికలను కేసీఆర్ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణం ఉందంటున్నారు. ఈ మునిసిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత.. సమీప భవిష్యత్ లో తెలంగాణలో ఎన్నికలు లేవు. అందువల్ల చివరి ఎన్నికల్లో గెలుపు ద్వారా.. ప్రజల్లో గులాబీ పార్టీ బలం తగ్గలేదని నిరూపించుకోవాలని చూస్తున్నారట. అదే సమయంలో విపక్షాల బలం కూడా గాలివాటమేనని చాటిచెప్పాలని భావిస్తున్నారట. అందుకే.. ఇంత సీరియస్ గా తీసుకున్నారని చెబుతున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.