KCR Health Update : గత నెలలో తుంటి ఎముక వీరిగి యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్.. శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులపాటు అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు ఆయన డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాదులోని నంది హిల్స్ లోని స్వగృహానికి కేసీఆర్ వెళ్లిపోయారు. అక్కడ వైద్యుల సలహాల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. నిష్ణాతులైన ఫిజియోథెరపిస్టులు ఆయనకు ఫిజియోథెరపీ చేస్తుండడంతో క్రమక్రమంగా కోలుకుంటున్నారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చినప్పుడు కేసిఆర్ మంచంలో పడుకునే ఉన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించడానికి వచ్చినప్పుడు కేసీఆర్ కుర్చీలో కూర్చొని కనిపించారు. ఆ దృశ్యాలను బట్టి చాలామంది కెసిఆర్ కోలుకున్నారని అనుకున్నారు. అయితే వాటికి బలం చేకూర్చే విధంగా భారత రాష్ట్ర సమితి నాయకులు కెసిఆర్ కు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
చాలా రోజుల వరకు మంచానికే పరిమితమైన కేసీఆర్.. చేతి కర్ర సహాయంతో.. వెనుక ఒక వైద్యుడు సలహాలు ఇస్తుండగా నడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకులు ఈ వీడియోను తమ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. వైద్యుడి సలహాల మేరకు కేసిఆర్ చేతి కర్ర సహాయంతో నడుస్తుండడం ఆ వీడియోలో కనిపించింది. అంటే దీన్ని బట్టి కెసిఆర్ కోలుకుంటున్నారు అనే సంకేతాలను పార్టీ శ్రేణులకు అధిష్టానం పంపించినట్టయింది. ఆయన నడుస్తున్న వీడియోను ఉద్దేశించి భారత రాష్ట్ర సమితి నాయకులు ఫైటర్, రెసీలియంట్, స్ట్రాంగ్ అనే పదాలను వాడారు. వాటికి కెసిఆర్ అనే యాష్ ట్యాగ్ ను కూడా జత చేశారు.
ఇక ఇటీవల కేసీఆర్ తన ఫామ్ హౌస్ పరిసర ప్రాంతానికి చెందిన ఫర్టిలైజర్ వ్యాపారి బాబు రెడ్డికి ఫోన్ చేశారు. తాను కోరుకుంటున్నానని.. పది రోజుల్లో ఫామ్ హౌస్ కి వస్తానని.. ఈసారి బొప్పాయి పంట సాగు చేద్దామని చెప్పారు. ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రస్తుతం ఏ ఏ విత్తనాలు అందుబాటులో ఉన్నాయో బాపురెడ్డిని ఆరా తీశారు.. బాపురెడ్డి కూడా కెసిఆర్ కోరినట్టుగానే విత్తనాలు, ఎరువులు సిద్ధంగా వచ్చినట్టు వివరించారు. కాగా కేసీఆర్ కర్ర సహాయంతో నడుస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది.