
కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ వ్యవహారం సెగలు పుడుతున్న వేళ హరీష్ రావు పేరు తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లు హరీష్ రావు సైలెంట్ గా ఉండడంతో ఈ వ్యవహారంలో ఆయన మద్దతు ఎటు అనేది హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ లో రాజకీయం దుమారం రేపింది. కానీ ఎట్టకేలకు ఈ వ్యవహారంలో హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. అది సంచలనమైంది. తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ వద్ద తనకే కాదు.. మంత్రి హరీష్ రావుకు కూడా అవమానం జరిగిందని.. ఎన్నో సార్లు హరీష్ ఇబ్బందులకు గురై అవమానాల పాలయ్యాడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి హరీష్ రావు స్పందించాడు. గట్టి కౌంటర్ ఇచ్చాడు.
నిన్న మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశాడు. ‘హరీష్ రావు కూడా పలు సందర్భాల్లో అవమానాలు ఎదుర్కొన్నారని’ అన్నారు. తనపై ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు హరీష్ రావు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
‘పార్టీ నాయకుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం నా కర్తవ్యంగా భావిస్తాను.. కేసీఆర్ పార్టీ అధ్యక్షులే కాదు. నాకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానులు.. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటాను ’’ అని హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. గతంలో అనేక సార్లు ఇదే విషయం సుస్పష్టంగా అనేక వేదికలపై చెప్పాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నానని తెలిపారు. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఇలాగే నడుచుకుంటానని అన్నారు.
ఇక తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఈటల రాజేందర్ వైఖరి ఉందని హరీష్ రావు విమర్శలు గుప్పించడం విశేషం. పార్టీ వీడడానికి ఆయనకు అనేక కారణాలు ఉండొచ్చని.. పార్టీలో ఉండాలా? వెళ్లిపోవాలా? అనేది ఆయన ఇష్టం అని హరీష్ రావు తెలిపారు. పార్టీకి ఈటల చేసిన సేవ కన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ అని హరీస్ రావు స్పష్టం చేశారు.
నా భుజాల మీద తుపాకీ పెట్టాలనుకోవడం విఫలయత్నం మాత్రమే కాదు.. వికారమైన ప్రయత్నం కూడా.. అని ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా హరీష్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.